సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఓటమి పక్కా

వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. తెలంగాణను కేటీఆర్, కవిత దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల హామీలు తప్ప ఆచరణలో శూన్యమని, డబుల్ బెడ్ రూం, చక్కెర కర్మాగారాల పునరుద్దరణ హామీ ఏమైందని ప్రశ్నించారు.
 
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ అర్వింద్‌పై విమర్శలు చేశారు. అర్వింద్ ఒక్క రూపాయి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఒక్క రూపాయి అయినా అదనంగా నిధులు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అంటూ సవాల్ విసిరారు.
 
ఈ విమర్శలపై తీవ్ర్ఫ్రంగా స్పందిస్తూ నిజామాబాద్ పర్యటనలో రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాట్లాడిన మాటలు ఆత్మస్తుతి, పరనిందను తలపించాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌస్, బాలీవుడ్ గార్డెన్లు తప్ప మరేం గుర్తుండవని అరవింద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
 
కేటీఆర్ సోదరి కవితలా తానేమీ లిక్కర్ స్కాం చేయలేదని మండిపడ్డారు. చెరుకు, పసుపు రైతులకు కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదని అంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు, వలస కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒక దిశ, మార్గం, విధానం అనేవి ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
 
మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి అక్కడి ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్యతో పోల్చి చూస్తే  ఎవరు బాగా సంపాదించారో తెలుస్తుందని దుయ్యబట్టారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధర ఎక్కువగా ఉందని విమర్శించారు.
 
‘మీ లెక్క మేం స్కాంలు, డ్రగ్స్ దందాలు చేయలేదు. పసుపు రైతుల్ని ఎందుకు పట్టించుకోరు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాదా? మీ దొరను, దొరతనాన్ని రోడ్డు మీదకు తెస్తం. పల్లె ప్రకృతి, వైకుంఠధామాల్లో కేంద్రం నిధులు ఉన్నాయి. కేంద్రం నిధులపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ విమర్శించారు.
 
కేటీఆర్ రాజీనామా చేస్తా అనగానే అక్కడున్నవాళ్లు చప్పట్లు కొట్టారని అరవింద్ ఎద్దేవా చేశారు. `ఆరోగ్యశ్రీ ఆటకెక్కించారు.. ఆయుష్మాన్ భారత్ అమలే లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని కట్టారు.. ఎన్ని ఇచ్చారు? 30 జిల్లాలకు డీఈవోలు, 90 శాతం మండలాల్లో ఎంఈఓలు లేరు. 17 ఇథనాల్ ప్లాంట్లకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది’ అని ధర్మపురి అర్వింద్ చెప్పారు.

డీపీఆర్‌లు, అవసరమైన ఇతర పత్రాలు ఇవ్వకుండా కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా కావాలంటే ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇవ్వాల్సినవి ఇస్తే జాతీయ హోదా తీసుకొచ్చే తాను తీసుకుంటానని ప్రకటించారు.