లాల్ చౌక్ లో నెహ్రు తర్వాత 75 ఏళ్లకు జాతీయ జెండా ఎగరేసిన రాహుల్

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం అకస్మాత్తుగా ప్రణాళిక మార్చుకుని శ్రీనగర్‌లోని సిటీ సెంటర్‌లోని లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సోమవారం శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయాలనేది ముందుగా ప్రకటించారు. అయితే, ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ లాల్ చౌక్‌లో మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత రాహుల్ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
 
ఇక్కడనే, 75 ఏళ్ళ క్రితంజమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా నెహ్రు పెను వివాదంపై కారణమయ్యారు. లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా భారత్‌కు ఇచ్చిన వాగ్దానం ఈరోజు నెరవేరిందని రాహుల్ ట్వీట్ చేశారు. “ద్వేషం ఓడిపోతుంది, ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. భారతదేశంలో కొత్త ఆశాజ్యోతి ఉంటుంది” అని పేర్కొన్నారు.
 
తమ ప్రణాళికలో ఆకస్మిక మార్పుకు చివరి నిమిషంలో అధికారులు  ఇచ్చిన “అనుమతి” కారణమని కాంగ్రెస్ పేర్కొంది. “వాస్తవానికి, భారత్ జోడో యాత్రలో చివరి రోజు అయిన సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించాలనేది ప్రణాళిక. జనవరి 30న లాల్ చౌక్‌కు అనుమతి రాలేదు’’ అని కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు.
 
అయితే,  “నిన్న రాష్ట్ర అధికారులతో చర్చించిన తర్వాత, వారు మా డిమాండ్‌ను అంగీకరించారు, కానీ 29న జాతీయ జెండాను ఆవిష్కరించవచ్చని తెలిపారు. కాబట్టి మేము చివరి నిమిషంలో మా కార్యక్రమాన్ని మార్చాము. ఈ రోజు రాహుల్ గాంధీ లాల్ చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఇది 75 సంవత్సరాల క్రితం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేత మొదటిసారి జరిగింది,” అని ఆయన పేర్కొన్నారు.
 
 చారిత్రాత్మక లాల్ చౌక్ వద్ద జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానని నెహ్రూ వాగ్దానం గురించి అడిగినప్పుడు, రమేష్ “నేను చెప్పాల్సింది చెప్పాను” అంటూ దాటవేశారు. జనవరి 30న శ్రీనగర్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని, దానిని లాల్ చౌక్‌లో ఆవిష్కరిస్తారని గత వారం కాంగ్రెస్ ఎంపీ, జమ్మూ కాశ్మీర్ ఇన్‌ఛార్జ్ రజనీ పాటిల్ ప్రకటించారు.
 
కాగా, 1992లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి గణతంత్ర దినోత్సవం రోజున లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని ప్రకటించారు. జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు పార్టీ సహచరులు కలిసి  కర్ఫ్యూ, భద్రతా వలయం మధ్య జెండాను ఎగురవేశారు. లాల్ చౌక్‌లో జెండా ఎగురవేత కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు రాకెట్లు పేల్చారు.
 
 లాల్ చౌక్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రీనగర్ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరిస్తారని పాటిల్ చెప్పారు. రాహుల్ యాత్ర చివరి రోజు ఉదయం శ్రీనగర్ నగర శివార్లలోని పంథా చౌక్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీనగర్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
దాల్ సరస్సు ఒడ్డున ఉన్న నెహ్రూ పార్క్‌లో యాత్ర ఆగుతుందని అసలు ప్లాన్ కాగా, రాహుల్ కవాతును గుప్కర్ దగ్గర నిలిపివేసి, వాహనాల కాన్వాయ్‌లో లాల్ చౌక్‌కు వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సోమవారం, రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు, దీనికి ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా ఆహ్వానించారు. 140 రోజుల పాటు సాగిన 4,080 కి.మీ యాత్రకు ప్రజా ర్యాలీ ముగింపు పలకనున్నారు.