ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు కృష్ణుడు, హనుమంతుడు

ప్రపంచంలోనే అతి గొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు  హనుమంతుడు అని  కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. హనుమంతుడు దౌత్యంతో పాటు దానిని కూడా దాటి సీతాన్వేషణలో భాగంగా సీతతో మాట్లాడటంతో పాటు, లంకాదహనం చేశాడని గుర్తు చేశారు.  పూణేలో జరిగిన జైశంకర్ స్వీయరచన ”ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టైన్ వరల్డ్”  పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యూహాత్మక సహనానికి ఒక ఉదాహరణగా మహాభారతంలో శిశుపాలిడి తలను ఖండించిన కృష్ణుడి ఉందంతాన్ని చెప్పారు.

100 తప్పులు చేసేంత వరకూ క్షమిస్తానని కృష్ణుడు వాగ్దానం చేశాడని, వంద తప్పులు పూర్తయిన తర్వాతే శిశుపాలుని వధించాడని తెలిపారు. మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు ఉండాల్సిన ప్రధాన అర్హతను ఈ ఘట్టం ఉదహరిస్తుందని పేర్కొన్నారు. కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన కురక్షేత్రను బహుళ ధ్రువ భారతదేశంగా జైశంకర్ పోల్చారు. దేశ ప్రయోజనాల విషయంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ముఖ్యమని స్పష్టం చేశారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఇదే విధానాన్ని అనుసరిస్తోందని, బైపోలార్ కోల్డ్ వార్ (1947-1991), యూనిపోలార్ టైమ్స్ (1991-2008), మల్టీపోలార్ టైమ్స్ (2008 నుంచి ఇప్పటి వరకూ)లోనూ ఇదే విధానాన్ని దేశం అనుసరిస్తూ వస్తోందని మంత్రి చెప్పారు.  అయితే, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఒంటిరిగా మిగిలిపోవడమో, పొత్తు పెట్టుకోవడమే కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అనుసరించే వ్యూహమని చెప్పారు.

వ్యూహాత్మక మోసం గురించి మహాభారతంలోని మరో ఘట్టాన్ని జైశంకర్ ప్రస్తావించారు. సూర్యాస్తమయం అయినట్టు శ్రీకృష్ణుడు భ్రమింపజేసిన ఘట్టాన్ని ఉదహరిస్తూ… ”కౌరవుల పక్షంలో పలువురు యోధులు అర్జునుడి కుమారుడైన అభిమన్యుని అత్యంత క్రూరంగా చంపేశారు. తన కుమారుడి చావుకు ప్రధాన కారకుడైన జయద్రధుని చంపుతానని ఆ మరుసటి రోజు అర్జునుడు భీకర ప్రతిజ్ఞ చేశాడు” అని గుర్తు చేశారు.

“జయద్రధుని చంపలేకపోతే తాను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తానని అంటాడు. కౌరవులు దీనిని అవకాశంగా తీసుకుని సాయంత్రం దాటేంత వరకూ జయద్రధుని దాచి పెట్టారు. సూర్యాస్తమయం అయినట్టు కృష్ణుడు భ్రమింపచేయడంతో జయద్రధుడు బయటకు వస్తాడు. వెంటనే బాణం సంధించమని కృష్ణుడు ఇచ్చిన ఆదేశంతో అర్జునుడి జయద్రధుని వధిస్తాడు” అని జైశంకర్ వివరించారు.

పొరుగు దేశాలతో భారత్ భౌగోళిక పరిమితులపై మంత్రి మాట్లాడుతూ, పాండవులు తమ బంధువులను ఎంచుకోలేదని, అలాగే మనం కూడా మన పొరుగువారిని ఎంచుకోలేమని పేర్కొన్నారు. పొరుగు వారు సద్భావనతో ఉండాలని మాత్రమే మనం ఆశించగలమని చెప్పారు. ‘రూల్స్ బేస్డ్ ఆర్డర్’ గురించి ప్రస్తావిస్తూ, భారతంలో కర్ణుడు, దుర్యోధనుడు ఈ నిబంధనలను అతిక్రమించారని చెప్పారు. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం వల్ల వారితో పాటు, వారి కుటుంబాలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదని గుర్తు చేశారు.

 చివరకు ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో పాటు, భారీ వినాశనం జరిగిందని, స్వజనులతో సహా సర్వాన్ని కోల్పోయారని వివరించారు. అలాగే అణ్వస్త్రదేశాలు పరస్పరం బెదరించుకుంటూ పోతే అది ఒకరినొకరు తుడిచిపెట్టేందుకు, భారీ విధ్వంసాన్ని మరింత వేగవంతం చేయడానికి దారితీస్తుందని స్పష్టం చేసారు.

వ్యూహాత్మక సర్దుబాటుకు అశ్వద్ధామ మరణానికి ధర్మరాజు తొలిసారి అబద్ధం చెప్పడాన్ని జైశంకర్ ప్రస్తావించారు. కౌరవుల సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుడు ఐదు రోజుల పాటు పాండవులతో భీకర పోరు చేశాడని, పాండవులు ఆయనను నిలువరించలేకపోయారని పేర్కొన్నారు.

దీంతో ద్రోణాచార్యుడిపై పాండవులు వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు. ద్రోణాచార్యుడికి తన కుమారుడు అశ్వద్ధామ అంటే పంచప్రాణాలని, అదే అతని బలహీనత అని, అశ్వద్ధాత మరణించాడని చెబితేనే ఆయన అస్త్రసన్యాసం చేస్తాడని, అయితే అది కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మజుడు చెబితేనే ఆ పని చేస్తాడని తెలుసుకుని ఆ ప్రకారం పాండవులు వ్యవహరించారని చెప్పారు.

దేశ విదేశాంగ మంత్రిగా తనను నియమించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. విదేశాంగ కార్యదర్శి వరకూ పరమితం కావాలని తాను అభిలషించినప్పటికీ మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, మోదీ కాకుండే మరెవరైనా తనకు మంత్రి పదవి ఇచ్చేవారా? అనేది తాను కచ్చితంగా చెప్పలేనని స్పష్టం చేశారు.