ఎఎస్సై కాల్పులకు గురైన ఒడిశా మంత్రి మృతి

భువనేశ్వర్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్‌ నేత నవకిశోర్‌ దాస్ ఆదివారం సాయంత్రం మ‌ర‌ణించారు. ఆదివారం ఉద‌యం న‌వ కిశోర్ దాస్‌పై ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జ‌రినాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ ప‌డిన న‌వ‌కిశోర్ దాస్‌ను తొలుత హుటాహుటిన స్థానిక ద‌వాఖాన‌కు తరలించారు. పరిస్థితి విషమించ‌డ‌తో మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించారు.

తొలుత ఆస్పత్రికి తీసుకు రాగానే డాక్టర్ దేబశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది.అయినప్పటికీ ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన తూటా గుండె ఎడమవైపు ఊపిరితిత్తుల భాగంలో గాయం చేయడం తో తీవ్రమై రక్తస్రావం జరగడంతో ఆయనను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.

కాగా, మంత్రి కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, మంత్రిపై అతడు ఎందుకు కాల్పులు జరుపాల్సి వచ్చిందనే విషయంలో స్ప‌ష్ట‌త‌ రాలేదని పోలీసులు చెప్పారు. ఏడేళ్లుగా మానసిక సమస్యలపై మందులు వాడుతున్నట్లు అతని భార్య చెప్పింది. మరోవైపు ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోషులను వదలబోమని స్పష్టం చేశారు.

మంత్రి నబకిశోర్ దాస్ మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర షాక్‌కు,ఆవేదనకు గురి చేసిందన్నారు.ఆయనను కాపాడేందుకు డాక్టర్లు చేయాల్సినదంతా చేశారని, కానీ ఆయన కోలుకోలేకపోయారన్నారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి ఆయన గొప్ప ఆస్తి అని, ఆరోగ్య శాఖలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు లబ్ధి చూకూరేందుకు కృషి చేశారన్నారు.

మంత్రి నవ కిశోర్ దాస్ ఆదివారం ఉదయం ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్‌ దగ్గర ఓ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆయన ఆలయం వద్ద కారు దిగుతుండగానే ఎఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. నేరుగా మంత్రి నవకిశోర్ దాస్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.  తొలుత గుర్తు తెలియని ఆగంతకులు మంత్రి నవ కిశోర్ దాస్ మీద కాల్పులు జరిపినట్లు ప్రకటించిన పోలీసులు.. తర్వాత ఆ కాల్పులు జరిపింది ఎఎస్సై గోపాల్ దాస్ అని గుర్తించారు.