తనను కూడా హిందువుగా పిలవమని కోరిన కేరళ గవర్నర్

విద్యావేత్త సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ తనను హిందువుగా పిలవాల్సిందే అని పట్టుబట్టారని గుర్తు చేస్తూ తనను కూడా హిందువు అని పిలవాలని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సూచించారు. హిందూ అనేది మతపరమైన పదం కాదని, భౌగోళిక పదమని కొత్త భాష్యం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
భారతదేశంలో పుట్టి ఇక్కడే నివసించే వారినందరినీ హిందువులనే పిలవాలని ఆయన తెలిపారు. భారతదేశంలో పుట్టినా, భారతదేశంలో పుట్టిన గింజలు తిన్నా.. ఇక్కడి నదుల నీరు తాగినా.. అలాంటి వారిని హిందువుగా పిలువడానికి అర్హులని ఆయన చెప్పారు. బ్రిటీష్ వారు మతం ఆధారంగా మనల్ని విభజించడం వల్లనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఖాన్ పేర్కొన్నారు.
ఉత్తర అమెరికాలో స్థిరపడిన మలయాళీ హిందువులు తిరువనంతపురంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రారంభించిన సందర్భంగా బీబీసీ డాక్యుమెంటరీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

భారత్‌ను వంద ముక్కలుగా చూడాలనుకునే వారు కలత చెందుతున్నారని, అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మన దేశాన్ని చీకట్లో చూడాలనుకునే వారి కుట్రలే ఇవి అని ధ్వజమెత్తారు.  న్యాయవ్యవస్థ తీర్పుల కన్నా.. ఆ డాక్యుమెంటరీని నమ్ముతున్న వారిని చూసి తాను చింతిస్తున్నానని ప్రతిపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.

 “గుజరాత్‌ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించినవారు భారతదేశంలో వందల సంవత్సరాల బ్రిటీష్‌ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదు?” అని  ఆయన బీబీసీని ప్రశ్నించారు.భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా బాగా రాణిస్తోందని, దీంతో విదేశీ డాక్యుమెంటరీ నిర్మాతలు నిరాశకు గురయ్యారని మండిపడ్డారు.

“ఇది భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం. ఈ డాక్యుమెంటరీని తీసుకురావడానికి ఈ నిర్దిష్ట సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?” అని కేరళ గవర్నర్ నిలదీశారు.  భారతదేశం పేద దేశం కాదని, భారతదేశ సంపదపై అత్యాశతో బయటి వారు ఇక్కడికి వచ్చారని ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. వీరి కారణంగానే 1947 నాటికి మనం దక్షిణాసియాలో పేదరికానికి చిహ్నంగా మారామని, అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.

ప్రస్తుతం భారతీయులు ప్రపంచంలోని అనేక పెద్ద బహుళజాతి కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. దీన్ని బట్టే ప్రపంచం భారత్ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నదని పేర్కొన్నారు. “చరిత్ర నుండి ప్రపంచానికి తెలుసు .. మనం శక్తివంతంగా ఉంటె ప్రపంచంలో మరెవ్వరు మనపై కన్నెత్తి చూడలేరు” అని స్పష్టం చేశారు.