పద్మ అవార్డు గ్రహితల గురించి తెలుసుకోవాలి

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు అందుకున్న వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. 97వ ఎడిషన్, 2023లో మొదటి మన్ కీ బాత్ రేడీయో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని ప్రజల పద్మా’ల ఉద్యమం ప్రజల భాగస్వామ్యంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ఈ ఉద్యమం నవ భారత నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు.

ఈ సారి పద్మ అవార్డు గ్రహితలలో చాలా మంది గిరిజన సంఘాలు, గిరిజన సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తులే ఉన్నట్టు చెప్పారు.  ఆదివాసీ ప్రాంతాలకు చెందిన చిత్రకారులు, సంగీతకారులు, రైతులు, కళాకారులు పద్మ అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు. దేశ ప్రజలందరూ వారి స్ఫూర్తిదాయకమైన కథలు చదవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ సూచించారు.

టోటో, హో, కుయ్, కువి, మందా వంటి గిరిజన భాషలపై కృషి చేసిన పలువురు ప్రముఖులకు కూడా పద్మ అవార్డులు వరించాయని స్పష్టం చేశారు. గిరిజన జీవితం నగర జీవితానికి చాలా భిన్నంగా ఉంటుందన్న చెబుతూ గిరిజన జీవన విధానంలో కూడా తనదైన సవాళ్లు ఉన్నాయని చెప్పారు. అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ గిరిజన సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ఆత్రుతతో కృషి చేస్తున్నాయని కొనియాడారు.

అంతే కాకుండా సిద్ధి, జార్వా, ఒంగే తెగలతో పనిచేసే వ్యక్తులు కూడా ఈ సారి పద్మ అవార్డులు పొందారని మోదీ తెలిపారు. ఈశాన్య ప్రజలు తమ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతూ.. పద్మ అవార్డుల్లోనూ మెరిశారని చెప్పారు.

‘ఇండియా – ది మదర్ ఆఫ్ డెమొక్రసీ’ పుస్తకాన్ని అందరూ చదవాలని మోదీ సూచించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, ఘనత సాధించినప్పటికీ, ప్రచారానికి నోచుకొనని అనేక మందిని ఇటీవల పద్మ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను ఉపయోగించడంపై విశేషంగా కృషి చేసిన దిలీప్ మహలనబీస్‌కు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. రతన్ చంద్ర కర్, హీరాబాయ్ లోబీ, మునీశ్వర్ చంద్ర దావర్ తదితర 25 మంది అన్‌సంగ్ హీరోస్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది.