పూటకో పార్టీ.. సంవత్సరానికో జెండా నా నైజం కాదు

పూటకొక పార్టీ, సంవత్సరానికొక జెండా పట్టుకునే రకం తాను కాదని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీలో ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వచ్చిన ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తన 20 ఏళ్ల రాజకీయ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వెళ్లగొట్టిన తర్వాత తనను బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు.

అంతే తప్ప తానేమీ రాజీనామా చేసి పోలేదని, పార్టీలు మారేవాణ్ణి కాదని వెల్లడించారు. కేసీఆర్ మంచి పనులు చేసి జనం మెప్పు పొందాలని చూడరని, ఇతర పార్టీలను బలహీనపరచడం, వాటిలో గందరగోళం సృష్టించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. అన్ని పార్టీల్లో కోవర్టులను పెట్టుకుని, వారిచ్చే సమాచారంతో ఎదుటి పార్టీలను దెబ్బకొట్టాలని చూస్తుంటారని ధ్వజమెత్తారు.

ఇదే రీతిలో బీఎస్పీ, సీపీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను మింగేశారని ఉదహరించారు. కేసీఆర్ నమ్ముకొన్నది ప్రజా బలాన్ని కాదని, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, కుట్రలు – కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తారని ఈటెల  ఆరోపించారు. డబ్బు సంచులను, ప్రలోభాలను నమ్ముకుని నాయకులను కొనుక్కనే కల్చర్ ఆయనదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ పరిస్థితుల్లో తనపై కాంగ్రెస్ నేతలు సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, ప్రజల సానుభూతి ఉందని స్పష్టం చేశారు. తాను బీజేపీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రూ. 800 కోట్లు ఖర్చు చేసి, ఎన్నో కుట్రలు చేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు తనను కడుపులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు కూడా తన చరిత్ర తెలుసు కాబట్టే వారి ఆశీర్వాదం తనపై ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు.

మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై, గణతంత్ర దినోత్సవాల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఈటల తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్చాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు.

కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు గవర్నర్ పట్ల ఉపయోగించిన భాష, మాట్లాడిన తీరు చూసి యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందని రాజేందర్ విమర్శించారు. గవర్నర్‌ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని చెప్పారు. కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో హోదా మరిచి మరీ నాటి గవర్నర్‌కు సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తేనని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

కానీ మహిళా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చిన తర్వాత ఆమె పట్ల వ్యవహరించిన తీరు సభ్యసమాజం గమనిస్తోందని ఈటెల హెచ్చరించారు. తను ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టానని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారని,  దొరల వ్యవస్థలో పురుషాధిక్యత ఉంటుందని, స్త్రీల పట్ల చులకన భావన ఉంటుందని చెప్పారు. అందుకే ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో మహిళ లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుత కేసీఆర్ దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు.