జెరూసలేంలో ఉగ్రదాడిలో ఏడుగురు మృతి

ఇజ్రాయెల్‌ రాజధాని జెరూసలేంలో జరిగిన ఉగ్రదాడిలో కాల్పులు జరిపిన ఉగ్రవాదితో సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.  శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జెరూసలేంలోని నెవ్‌ యాకోవ్‌ బౌలేవార్డ్‌లోని యూదుల ప్రార్థనామందిరం వద్దకు ఓ ఉగ్రవాది వచ్చి ఆ ప్రాంతంలోని ప్రజలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
 
సమాచారం అందుకున్న పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదిపై ఎదురుకాల్పులు జరపడంతో అతను చనిపోయాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. ప్రార్థనా మందిరం వద్దకు కాల్పులు జరిపేందుకు వచ్చిన ఉగ్రవాది తెల్లటి వాహనాన్ని తీసుకుని వచ్చాడు. ఆ వాహనాన్ని పోలీసులు ద్వంసం చేశారు. తూర్పు జెరూసలేం నివాసి అయిన ఉగ్రవాది కారులోంచి బయటకు వచ్చి కాలినడకన తప్పించుకునే ప్రయత్నంలో అధికారులపై కాల్పులు జరిపిన తర్వాత కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
 
ఏడుగురు మరణించడంతో, జెరూసలెంలో జరిగిన కాల్పులు 2011 నుండి అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా అధికారులు పేర్కొన్నారు. 2008లో ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం నుండి ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి ఎనిమిది మంది ఇజ్రాయెల్‌లను చంపారు. ఆ ఘటన తర్వాత ఇది అత్యంత ఘోరమైన పాలస్తీనా ఉగ్రదాడి.
 
ఈ కాల్పుల్లో 10 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో 70 ఏళ్ల వృద్ధుడు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని మాగెన్‌ డేవిడ్‌ అడోమ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ఏజెన్సీ (ఎండిఎ) వెల్లడించింది. ఈ దాడి చాలా తీవ్రమైన దాడి అని ఎండిఎకు చెందిన పారామెడిక్‌ ఫాడి డెకిడెక్‌ చెప్పారు.  ప్రార్థనా మందిరం వద్ద ఉగ్రవాది కాల్పులు జరుపుతున్న సమయంలో.. తాను చాలా బుల్లెట్‌ల శబ్దాన్ని విన్నట్లు మందిరం సమీపంలో నివశించే మతానెల్‌ అల్మాలెమ్‌ అనే 18 ఏళ్ల విద్యార్థి మీడియాకు చెప్పారు.
 
సంఘటనా స్థలం నుండి పోలీసు కమిషనర్ కోబి షబ్తాయ్ విలేకరులతో మాట్లాడుతూ, ఇన్నేళ్లలో ఇజ్రాయెల్ చూసిన అత్యంత దారుణమైన దాడిలో ఇది ఒకటని చెప్పారు. “ఉగ్రవాది తనకు ఎదురైన ప్రతి ఒక్కరిపై కాల్పులు జరిపాడు. అతను కారు దిగి తుపాకీతో హంతక విధ్వంసాన్ని ప్రారంభించాడు,” అని షబ్తాయ్ తెలిపారు.
 
 ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, సంఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత మాట్లాడుతూ, దాడి “సంవత్సరాలలో మనకు తెలిసిన అత్యంత తీవ్రమైనది” అని పేర్కొన్నారు. “మా హృదయాలు కుటుంబాలతో ఉన్నాయి. ఇంత త్వరగా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులను నేను అభినందిస్తున్నాను’ అని నెతన్యాహు కొనియాడారు. క్యాబినెట్ శనివారం సమావేశమవుతుందని చెబుతూ “ఈ రాత్రి ప్రారంభమయ్యే అనేక తక్షణ చర్యలను మేము నిర్ణయించుకున్నాము” అని ఆయన వెల్లడించారు. 
 
 ఉగ్రవాదిని కాల్చిచంపిన పోలీసు అధికారి ఘటనా స్థలంలో నెతన్యాహును కలిశారు. “వాహనం ఆగిపోయింది, ఉగ్రవాది తన ఆయుధాన్ని బయటకు తీశాడు. నేను అతని దిశలో వేగంగా కదులుతూనే ఉన్నాను. అతను మాపై కాల్పులు జరుపుతున్నప్పుడు అతనిని కాల్చివేసాము”అని వివరించాడు.