ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా

విజయంతో గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించాలనుకున్న  భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆశలు ఫలించలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా మీర్జా-రోహన్‌ బోపన్న జోడీ ఓటమిపాలైంది. ఫైనల్‌లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో 7-6, 6-2తో సానియా జోడీ ఓటమి చవిచూసింది.
 
దీంతో ఓటమితో టెన్నిస్‌ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్లయింది.  సానియా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. 2009లో మహేశ్‌ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) కైవసం చేసుకున్నది. ఆ తర్వాత మరో ఐదు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు గెలుపొందింది.
 
వాటిలో రెండు మిక్స్‌డ్‌ డబుల్స్‌, మూడు మహిళ డబుల్స్‌ ఉన్నాయి. మొత్తంగా ఆమె 43 డబుల్స్‌ టైటిళ్లను సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌ విభాగంలో 91 వారాలపాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్‌లో నంబర్‌ 1 ప్లేస్‌లో కొనసాగింది.  కాగా, తన చివరి మ్యాచ్‌లో ఓటమి చెందడంతో సానియా మీర్జా కన్నీరుపెట్టుకున్నారు. విజయం సాధించిన బ్రెజిల్‌ జోడీ లూయిసా, రఫెల్‌ను అభినందించారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023తో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించుకుంటున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించారు.‘‘నా వృత్తిపరమైన కెరీర్ మెల్బోర్న్‌లో ప్రారంభమైంది.నా కొడుకు ముందు నేను గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఆడగలనని ఎప్పుడూ అనుకోలేదు’’ అని సానియా వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో సానియా తన చివరి టోర్నమెంట్‌ను ఆడనున్నారు.