జాతి విద్రోహ శక్తులకు నారాయణపేట కలెక్టర్ మద్దతు

మత మార్పిడి చర్యలను ప్రోత్సహిస్తున్న నారాయణపేట కలెక్టర్ తీరును  విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్రంగా ఖండించారు.భారత గణతంత్ర దినోత్సవం రోజున “జాతీయ జెండాను ఎగరవేయను. నా మతం వేరు.. మా సిద్ధాంతం వేరు..” అంటూ నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లె గడ్డ అంగన్ వాడి టీచర్ ఎస్తేర్ పై  పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
అంగన్ వాడి టీచర్ ప్రవర్తన పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు నారాయణపేట కలెక్టర్ హర్ష ను కలవడానికి శుక్రవారం వెళ్లారు.  దీంతో ఫిర్యాదు చూడగానే కలెక్టర్ తీవ్రస్థాయిలో నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీకు పని పాట లేదా” అంటూ స్వరం పెంచారు.
 
కలెక్టర్ స్వరం పట్ల కంగుతిన్న పరిషత్ నేతలు డాక్టర్ క్యాతన్ రఘునాథ్ స్పందిస్తూ.. “మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదు.. ఫిర్యాదును తీసుకొని వాస్తవాలు పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సిందే” అని గట్టిగా చెప్పారు. దీంతో అక్కడున్న సిబ్బందికి పరిషత్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
 
ఈ వ్యవహారంపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నేతలు నారాయణపేట కలెక్టర్ తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అప్పటికి స్పందించకపోతే ఢిల్లీకి వెళ్లి డిఓపిటిలో నారాయణపేట కలెక్టర్ తీరుపై ఫిర్యాదు చేసి, న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
 
ఒక ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా జాతి విద్రోహ శక్తులను ప్రోత్సహించడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన వెంటనే స్పందించి నారాయణపేట కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు.