విద్యార్థులు గాడ్జెట్స్‌కి ఎందుకు బానిసలు కావాలి?

విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని గాడ్జెట్స్‌కి ఎందుకు బానిసలం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల (గాడ్జెట్స్‌) కన్నా మీరు సమర్థవంతులని.. వాటిని తెలివిగా, స్మార్ట్‌గా వినియోగించాలని హితవు చెప్పారు.శుక్రవారం నిర్వహించిన ”పరిక్షా పే చర్చ” కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో మాట్లాడారు.

ప్రధాని మోదీ ప్రతి ఏటా సీబీఎస్ఈ పరీక్షలకు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పరీక్ష భయం, ఒత్తిడి పోగొట్టడంతో పాటు వాటిని ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇస్తుంటారు ప్రధాని. ఈ ఏడాది కూడా ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్‌ స్టేడియం వేదికగా ప్రధాని మోదీ హోస్ట్‌గా జరిగిన పరీక్ష పే చర్చ జరిగింది. ఎంతో మంది విద్యార్థులతో సంభాషించిన ఆయన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

భారతదేశంలోని ప్రజలు సగటున ఆరుగంటలపాటు ఎలక్ట్రానిక్‌ పరికారాలను చూస్తున్నారని, ఇది ఆందోళనకరమైన అంశమని ప్రధాని చెప్పారు. దేవుడు మనకు అపారమైన సామర్థ్యంతో పాటు స్వతంత్రతను, స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని ఇచ్చాడని.. అలాంటప్పుడు గాడ్జెట్స్‌కి ఎందుకు బానిసలం కావాలని మోదీ ప్రశ్నించారు.

సగటున ఆరుగంటల పాటు గాడ్జెట్స్‌ వినియోగం తయారీ దారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఇది ప్రజల సృజనాత్మకతను అడ్డుకుంటుందని ప్రధాని హెచ్చరించారు. పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కి పాల్పడటం, చీటింగ్‌ చేయడం వంటి వాటి గురించి కూడా ప్రస్తావించారు.

కాలం మారుతున్నదని… అడుగడుగునా పరీక్షలను రాయాల్సివుంటుందని, చీటింగ్‌తో ఒకటి రెండు పరీక్షల్లో విజయం సాధించవచ్చు కానీ, జీవితంలో ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేరని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ నైపుణ్యాలు ఉంటాయని… వాటిగురించి తెలుసుకోవాలని సూచించారు.

తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు ఆసక్తికర సమాధానం

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్‌ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర బహు భాషలపై పట్టు సాధించాలంటే ఎలా కష్టపడాలని అడిగింది.ఆ అమ్మాయి ప్రశ్నకు బదులిస్తూ ప్రధాని మోదీ జవాబిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను వివరించారు. ” రోజు వారీ కూలీలు నివసించే ఓ బస్తీలోని ఒక ఎనిమిదేళ్ల చిన్నారి..  హిందీతో పాటు తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ మాట్లాడటం నన్ను ఆశ్చర్యపర్చింది. అసలు ఆ బాలిక అన్ని భాషలు ఎలా మాట్లాడగలుగుతుందని ఆరా తీశాను” అని చెప్పారు.

“ఆ చిన్నారి ఇంటి పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తున్నారు.  బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారంతా ఒక ఒక దగ్గర నివసించడంతో .. వారితో ఆ బాలిక నిత్యం మాట్లాడుతుండేది. అలా ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు.’ అని ప్రధాని సమాధానం చెప్పారు.

ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం 38 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ప్రతిఏడాది లాగే ఈసారి కూడా పరీక్షలకు జీవితాన్ని లింక్‌ చేస్తూ మోదీ విలువైన సూచనలిచ్చారు. అందులో షార్ట్‌కట్స్‌ వద్దంటూ ఆయన చెప్పిన సందేశం విద్యార్థులను కట్టిపడేసింది. స్మార్ట్‌ వర్క్‌ లేక హార్డ్ వర్క్‌లో ఏదీ ఇంపార్టెంట్? అంటూ ఓ విద్యార్థి మోదీని ప్రశ్నించాడు.

దీనికి మోదీని ఇచ్చిన సమాధానంతో కార్యక్రమ ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. కొంతమంది తెలివితో వర్క్‌ చేస్తారని, మరికొంతమంది తెలివిగా కష్టపడతారని మోదీ తెలిపారు. అయితే కొంత మంది విద్యార్థులు వారి సృజనాత్మకతను పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ ఆ తెలివిని మంచి మార్గానికి వాడుకుంటే జీవితంలో విజయాలు సాధిస్తారని మోదీ హితవు చెప్పారు. జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్స్‌ వెతుక్కోకూడదంటూ స్పష్టం చేశారు.