దక్షిణాఫ్రికా నుండి భారత్ కు 100కు పైగా చిరుతలు 

ఆసియాకు చెందిన దేశంలో తిరిగి 100కు పైగా చీతాలను (చిరుత‌) ప్ర‌వేశ‌పెట్టేందుకు ద‌క్షిణాఫ్రికా, భారత్ లు  అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. ఒప్పందం ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 2023లో తొలిబ్యాచ్‌గా 12 చిరుతల‌ను ద‌క్షిణాఫ్రికా నుంచి ఇక్క‌డ‌కు త‌ర‌లించ‌నున్నారు. ఇవి, 2022లో న‌మీబియా నుంచి భార‌త్‌కు తీసుకువ‌చ్చిన ఎనిమిది చిరుత‌ల‌తో క‌లిసి ఉంటాయి. 
 
చిరుత‌ల జ‌నాభాను పున‌రుద్ధ‌రించ‌డం అన్న‌ది భార‌త్‌కు ఒక ప్రాధాన్య‌త‌. ఇది కీల‌క‌మైన‌, సుదూర ప‌రిర‌క్ష‌ణ ప‌రిణామాల‌ను క‌లిగి ఉండ‌టంతో పాటుగా  భార‌త‌దేశంలో చారిత్రాత్మ‌క ప‌రిధిలో చిరుత‌ల క్రియాత్మ‌క పాత్ర‌ను ఏర్పర‌చ‌డ‌మే కాక‌, స్థానిక స‌మూహాల జీవ‌నోపాధి ఎంపిక‌ల‌ను, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి తోడ్ప‌డ‌డంతో స‌హా అనేక ప‌ర్యావ‌ర‌ణ ల‌క్ష్యాల‌ను సాధిస్తుంది.
 
ఫిబ్ర‌వ‌రిలో 12 చిరుత‌ల‌ను దిగుమ‌తి చేసుకున్న అనంత‌రం, రానున్న ఎనిమిది నుంచి 10 ఏళ్ళ వ‌ర‌కు ప్ర‌తి ఏడాది 12 చొప్పున ఈ చిరుత‌ల‌ను తీసుకురావాల‌న్న‌ది ఈ ఒప్పందంలో ప్రధాన అంశం. గ‌త శ‌తాబ్దంలో మితిమీరిన వేట‌లు, ఆవాసాలు కోల్పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల అంత‌రించిపోయిన ఈ విశేష జాతుల‌ను భార‌త ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన అభ్య‌ర్ధ‌న మేర‌కు ఈ చిరుత‌ల‌ను తిరిగి పూర్వ‌శ్రేణి రాష్ట్రాల‌కు తీసుకొచ్చే కృషి చేస్తున్నారు.
 
‘‘ఆచరణీయమైన, సురక్షితమైన చిరుతల జనాభాను స్థాపించడంలో సహాయపడటానికి రాబోయే ఎనిమిది నుంచి 10 ఏళ్లలో సంవత్సరానికి 12 చొప్పున తరలించాలనేది ప్రణాళిక’’ అని దక్షిణాఫ్రికా ఒక ప్రకటనలో తెలిపింది. ఒకప్పుడు ఆసియా చీతాలకు కేంద్రంగా భారత్‌లో 1948లో ఉమ్మడి మధ్యప్రదేశ్‌లోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి.
 
దీంతో 1952లో అంతరించిన జాతిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వన్య ప్రాణుల సంరక్షకుల కృషి.. కేంద్ర ప్రభుత్వం చొరవతో నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తెప్పించారు. వీటిని ప్రత్యేక బోయింగ్‌ విమానంలో సెప్టెంబరు 17న తీసుకొచ్చారు.  భార‌త‌దేశంలో చిరుత‌ల‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌డంపై అవ‌గాహ‌న ఒప్పందం (ఎంఒయు)  భార‌త‌దేశంలో ఆచ‌ర‌ణీయ‌, సుర‌క్షిత‌మైన చిరుత జ‌నాభాను ఏర్ప‌ర‌చేందుకు ఇరు పార్టీల మ‌ధ్య స‌హ‌కారాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డ‌మ కాక ప‌రిర‌క్ష‌ణ‌ను ప్రోత్స‌హిస్తుంది.
 
దీనితోపాటుగా చిరుత సంర‌క్ష‌ణను ప్రోత్స‌హించ‌డానికి, ప‌రిర‌క్షించేందుకు నైపుణ్యాల‌ను పంచుకోవ‌డానికి, భాగ‌స్వామ్యానికి, సామ‌ర్ధ్య నిర్మాణానికి తోడ్ప‌డుతుంది. మాన‌వ‌- వ‌న్య‌ప్రాణుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ప‌రిష్కారం, వ‌న్య‌ప్రాణుల‌ను ప‌ట్టుకొని మ‌రొక‌చోట పున‌రావాసం క‌ల్పించ‌డం, ఇరు దేశాల‌లో వీటి ప‌రిర‌క్ష‌ణ‌లో స‌మాజాన్ని క‌లుపుకుపోవ‌డం ఇందులో భాగం.
 
ప్రయోగాత్మకంగా జాగ్రత్తగా ఎంచుకున్న ప్రదేశంలోకి ఆఫ్రికన్ చిరుతలు, విభిన్న ఉపజాతులను తీసుకురావచ్చని 2020లో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో చీతాల ప్రాజెక్ట్ ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
 
అవ‌గాహ‌నా ఒప్పందం ప్ర‌కారం, సాంకేతిక‌త‌లు, నిర్వ‌హ‌ణ‌లో వృత్తినిపుణుల‌కు శిక్ష‌ణ‌, విధానం, విజ్ఞానం బ‌దిలీ ద్వారా భారీగా కార్నివోర్ (మాంసాహారం తీసుకునే జంతువుల‌)  ప‌రిర‌క్ష‌ణ‌తో పాటుగా, ఇరు దేశాల మ‌ధ్య స్థానాంత‌ర‌ణం చేసిన చిరుత‌ల ద్వైపాక్షిక సంర‌క్ష‌ణ‌ను ఏర్పాటు చేయ‌డం కోసం ఇరు దేశాలు స‌హ‌క‌రించుకుంటాయి.  ప్ర‌తి ఐదేళ్ళ‌కు ఎంఒయులోని అంశాల‌ను అది స‌హేతుకంగా ఉండేందుకు స‌మీక్షిస్తారు.