గవర్నర్ తమిళిసైపై ఎమ్మెల్సీ కౌశిక్ వ్యాఖ్యలపై దుమారం

గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

 బీజేపీ సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.  గురువారం జమ్మికుంటలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులకు తమిళిసై ఆమోదం తెలపడం లేదని, గవర్నర్ ఎందుకు దాచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళి సై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. గవర్నర్ పట్ల ఆయన మాట్లాడిన భాష సరిగ్గా లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్‌కు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర గవర్నర్‌ను అగౌరపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఒక మహిళా గవర్నర్‌పై ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? అంటూ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు  అహంకారంతో ఒక గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

‘ఒక మహిళా గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజంపైన చేసినట్లే. మహిళలందరినీ అవమానించినట్లే. అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని  శ్రీవాణి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తన ఫిర్యాదులో కోరారు.

మహిళా గవర్నర్‌ను అవమానించడం అంటే మొత్తం మహిళా సమాజాన్ని అవమానించినట్లేనని, కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.