అలనాటి అందాల నటి జమున కన్నుమూత

టాలీవుడ్ లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. అలనాటి అందాల నటి జమున (86) కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందారు. తన అందంతోనే కాకుండా, అభినయం, నృత్యాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు. ఆమె మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో ఆమె నటించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం ఆమె రాణించారు.

 నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి అనే దంపతులకు 1936 ఆగస్టు 30న కర్నాటకలోని హంపీలో జమున జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జమున ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. సినిమాల్లోకి రాకముందు జమున పేరు జానాభాయిగా ఉండేది.  జ్యోతిషుల సూచనతో కుమార్తె పేరును జమునగా తల్లిదండ్రులు మార్చారు.

తల్లి దగ్గరే సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. నటుడు జగ్గయ్య.. ఖిల్జీరాజు పతనం అనే నాటకంలో పాత్రకోసం జమునను ఎంపిక చేశారు. అనంతరం ఆమె అడుగులు సినిమావైపు పడ్డాయి. 14 ఏండ్ల వయస్సులోనే సినిమాల్లోకి ప్రవేశించారు. 1953లో నటించిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

అయితే ‘అంతా మనవాళ్లే’ సినిమాతో ఆమె కెరీర్‌ మలుపుతిరిగింది. నిరుపేదలు, మా గోపీ, బంగారుపాప సినిమాలు ఆమెకు మంచిపేరు తీసుకొచ్చాయి. మిస్సమ్మ సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకున్నది. రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించినప్పటికీ.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించిపోయారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 198 సినిమాల్లో ఆమె నటించారు. ఇందులో తెలుగులో 145 సినిమాలు ఉండగా, తమిళం 20, కన్నడం 7, హిందీలో 10 చిత్రాల చొప్పున ఉన్నాయి. 1959 నుంచి సావిత్రితోపాటే స్వర్ణయుంగం చూసిన జమున.. తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, భూకైలాస్‌, దొంగల్లో దొర, ఇలవేల్పు, ఇల్లరికం, ముద్దుబిడ్డ, చిరంజీవులు, మిస్సమ్మ, మూగమనసులు, శ్రీకృష్ణ తులాభారం, రాముడు-భీముడు, తోడు-నీడ, రాము, లేతమనసులు, పూలరంగడు, ఉండమ్మా బొట్టు పెడతా, గులేబకావళి కథ, బొబ్బిలియుద్ధం, మంచి మనిషి సినిమాల్లో ఆమెకు మంచి పేరువచ్చింది.

చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన తొలితరం నాయిక జమున కావడం విశేషం. భర్త, పిల్లల కోసం ఆమె తన మకాంను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు మార్చారు. ఇక్కడి వచ్చినతర్వాత ఆమెకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆహ్వానంతో 1980లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1985లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా గెలుపొందారు.

1991 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీచేయగా ఓటమిచవిచూశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.  1990లో అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలో బిజెపి తరుపున జమున ప్రచారం చేశారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు మిలాన్ సినిమాలో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్నారు. 2008లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు.  ఆమె మృతి పట్ల  ఏపి సిఎం జగన్‌, తెలంగాణ సిఎం కెసిఆర్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.