హైదరాబాద్‌లో జీ-20 -స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశం

జీ-20 -స్టార్టప్  20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సమావేశం   జనవరి 28-29 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నది. సమావేశానికి జీ-20 సభ్య దేశాల  ప్రతినిధులు, పరిశీలకుల దేశాల నుంచి తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, బహుళ పక్ష సంస్థల ప్రతినిధులు, భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ప్రతినిధులు పాల్గొంటారు.

రాబోయే సంవత్సరాల్లో జీ-20 దేశాలతో పాటు ప్రపంచ దేశాల్లో  వ్యవస్థాపకత, ఆవిష్కరణల రంగాలకు ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేసిన నేపథ్యంలో అభివృద్ధికి దోహదపడే విధాన నిర్ణయాలను ఎంగేజ్‌మెంట్ గ్రూప్  సిఫార్సు చేస్తుంది.   స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారం అందించడం, స్టార్టప్‌లు,కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణ రంగంలో ఉన్న సంస్థలు, స్టార్టప్‌ రంగంలో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా పటిష్ట  వ్యవస్థను రూపొందించడానికి సమావేశం కృషి చేస్తుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన స్టార్టప్ 20 ఇండియా అధ్యక్షుడు  డాక్టర్ చింతన్ వైష్ణవ్  ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగం కలిగి ఉన్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందిందని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న రంగాల్లో వినూత్న స్టార్టప్‌లకు అందించే అంశంలో  భారతదేశం అగ్రగామిగా ఉందని చెప్పారు.  ఏకాభిప్రాయ-ఆధారిత విధానాల  ద్వారా ప్రపంచ  స్టార్టప్ రంగం మధ్య  సమన్వయం సాధించడానికి, నూతన అవకాశాలు గుర్తించడానికి, ప్రపంచ  స్టార్టప్ రంగాల  మధ్య అవసరమైన  పంచుకునే విధంగా విధానాలు రూపొందించడానికి సమావేశం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

“ఇంక్యుబేటర్లు , ప్రభుత్వ ఏజెన్సీలు, రంగంలో పనిచేస్తున్న ఇతర సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు కుదిరేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఇటువంటి ఒప్పందాల వల్ల జీ-20 సభ్య దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల స్టార్టప్ సంస్థల మధ్య అవగాహన పెరిగి  సమాచార మార్పిడి జరిగి సమస్యలు పరిష్కారం అవుతాయి” అని డాక్టర్ చింతన్ వైష్ణవ్ వివరించారు.

“స్టార్టప్‌లతో  పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయడానికి దోహదపడే సహాయక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.” అని ఆయన తెలిపారు.  స్టార్టప్‌ – 20లో  ఫౌండేషన్, అలయన్స్ టాస్క్‌ఫోర్స్, ఫైనాన్స్ ,ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ పేరిట మూడు ప్రధాన టాస్క్‌ఫోర్స్‌లు పనిచేస్తాయి.

ఏకాభిప్రాయ-ఆధారిత విధానాల  ద్వారా ప్రపంచ స్టార్టప్ రంగం మధ్య  సమన్వయం సాధించడానికి, నూతన  అవకాశాలను గుర్తించి  స్టార్టప్ సంస్థల  మధ్య ప్రపంచవ్యాప్తంగా సమాచార మార్పిడి జరిగేలా చూసేందుకు ఫౌండేషన్, అలయన్స్ టాస్క్‌ఫోర్స్ కృషి చేస్తుంది. స్పష్టమైన పరిష్కార మార్గాలతో స్టార్టప్ సంస్థలతో కలిసి  జీ-20 దేశాలకు చెందిన పరిశ్రమలు పనిచేసేలా చూసేందుకు ఫౌండేషన్ మరియు అలయన్స్ టాస్క్‌ఫోర్స్ ప్రణాళిక రూపొందిస్తుంది.

పరిశ్రమలు,  ప్రభుత్వ సంస్థలు  స్టార్టప్‌లతో కలిసి పనిచేయడానికి అవసరమైన  సహాయక విధానాలు రూపొందించడం జీ-20 దేశాల నిరంతర సహకారం కోసం ఫౌండేషన్ మరియు అలయన్స్ టాస్క్‌ఫోర్స్ కృషి చేస్తుంది.  స్టార్టప్‌లకు మూలధన పెట్టుబడులు సమకూర్చడం, ప్రారంభ-దశ స్టార్టప్‌లకు ప్రత్యేకంగా ఆర్థిక, పెట్టుబడి వనరులు అందుబాటులోకి తెచ్చి  స్టార్టప్‌లకు మూలధనం లభ్యత పెంచడం లక్ష్యంగా ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది.

ప్రపంచ పెట్టుబడి రంగంలో  స్టార్టప్‌ల కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి అవసరమైన సౌకర్యాలను ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్ కల్పిస్తుంది. జీ -20 సభ్య దేశాలలో స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలు ఆధారంగా పటిష్ట వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్ చర్యలు అమలు చేస్తుంది. పెట్టుబడి సామర్ద్యాన్ని పెంపొందించడానికి అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలలో అమలు చేయగల విధానాలను రూపొందించడానికి ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్  సహాయపడుతుంది.

మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు, సంస్థలకు మరింత సహకారం అందించడానికి అవసరమైన చర్యలను ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ గుర్తించి అమలు చేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్న స్టార్టప్‌లకు,    ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్న ఎస్డీజీ రంగాలపై పనిచేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, పని చేస్తున్న స్టార్టప్‌లకు తగిన ప్రచారం కల్పించడానికి ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ టాస్క్‌ఫోర్స్ విధానాలు రూపొందిస్తుంది.

సుస్థిర విధానాలు అనుసరించి పనిచేస్తున్న స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టే  విధంగా మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ టాస్క్‌ఫోర్స్ చర్యలు అమలు చేస్తుంది.   జీ-20 సభ్య దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల స్టార్టప్ రంగం  సహకారం లభించేలా చూడాలని  ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ టాస్క్‌ఫోర్స్  లక్ష్యంగా పెట్టుకుంది.