మ‌నీల్యాండ‌రింగ్ కేసులో టీఎంసీ నేత సాకేత్ గేఖ‌లేను అరెస్ట్

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసుకు సంబంధించి టీఎంసీ నేత సాకేత్ గోఖ‌లేను ఈడీ బుధ‌వారం అరెస్ట్ చేసింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేక‌రించిన రూ . 1,07 కోట్ల‌ను సాకేత్ గోఖ‌లే దుర్వినియోగం చేశార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. టీఎంసీ నేత‌ను గుజ‌రాత్‌లో అరెస్ట్ చేసి స్ధానిక కోర్టులో హాజ‌రు ప‌రిచారు.  గుజ‌రాత్‌లోని మోర్బిలో బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న అనంత‌రం ప్ర‌ధాని మోదీ ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించిన క్ర‌మంలో ఓ ఫేక్ న్యూస్‌ను ట్వీట్ చేయ‌డంతో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో సాకేత్ గోఖ‌లేను అరెస్ట్ చేశారు.

ఆపై ఆయ‌నకు బెయిల్ మంజూరైనా గుజ‌రాత్ పోలీసులు ప‌లుమార్లు అదుపులోకి తీసుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేక‌రించిన సొమ్మును గోఖ‌లే స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు వాడుకున్నార‌ని గుజ‌రాత్ పోలీసులు ఆరోపించిన నేప‌ధ్యంలో ఈడీ ఆయ‌న‌ను అరెస్ట్ చేసింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో వంతెన కూలిన ఘ‌ట‌న చోటుచేసుకున్న మోర్బిని సంద‌ర్శించేందుకు ప్ర‌ధాని మోదీ రాగా, ఆ ప‌ర్య‌ట‌న‌కు గుజ‌రాత్ ప్ర‌భుత్వం రూ . 30 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని ఓ గుజ‌రాతీ ప‌త్రిక క‌ధ‌నాన్ని గోఖ‌లే ట్వీట్ చేశారు. డిసెంబ‌ర్ 1న ఈ క‌థనాన్ని పీబీఐ తోసిపుచ్చుతూ ఇది ఫేక్ న్యూస్ అని నిర్ధారించింది.

ఈ వార్త‌ను తాము ప్ర‌చురించ‌లేద‌ని స‌ద‌రు గుజ‌రాతీ ప‌త్రిక స్ప‌ష్టం చేసింది. దీంతో గోఖ‌లేను గుజ‌రాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా స‌మీకరించిన సొమ్మును గోఖ‌లే స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు వాడుకున్నార‌ని దీనిపై లోతైన ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని పోలీసులు కోర‌డంతో ఈడీ రంగంలోకి దిగింది.