మహిళల ఐపీఎల్ జట్ల వేలంలో రూ. 4,670 కోట్ల ఆదాయం

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రకటించింది. మొదటి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కోసం జట్ల వేలంలో రికార్డుస్థాయిలో రూ. 4,670 కోట్లు వచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ వేలానికి సంబంధించిన వివరాలను బిసిసిఐ సెక్రటరీ జే షా బుధవారం ప్రకటించారు.

ఈ మ్యాచ్‌కి 2008లో మొదటి పురుషుల ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) కోసం జట్ల వేలం ద్వారా కన్నా ఎక్కువ మొత్తం వచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ లీగ్‌కు ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఔూూ) అని కూడా పేరు పెట్టింది. బిసిసిఐ ఈ కొత్త టోర్నమెంట్‌ కోసం అనేక కంపెనీల నుంచి బిడ్‌లను స్వీకరించింది. 5 అత్యధిక బిడ్డర్‌ ఫ్రాంచైజీల పేర్లను బుధవారం ప్రకటించింది.

ఈ వేలంలో అహ్మదాబాద్‌, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, లక్నో నగరాలు ఫ్రాంచైజీలను పొందాయి. ఈ ఐదు నగరాల్లో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఇప్పటికే ఉన్నాయి.  లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను ప్రకటించింది. వీటిలో అహ్మదాబాద్‌ పేరు మీద అత్యధిక బిడ్‌ వచ్చింది. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ తర్వాత ముంబయి ఫ్రాంచైజీని రూ. 912.99 కోట్లతో రిలయెన్స్ గ్రూపులో భాగమైన ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకోగా, బెంగళూరు ఫ్రాంజైజీని రూ.901 కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ సొంతం చేసుకుంది. మెన్స్ ఐపీఎల్లో  ముంబై ఇండియన్స్  టీమ్ కూడా రిలయెన్స్ చేతుల్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే మెన్స్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ గ్రూపు మహిళల ఐపీఎల్లోనూ బెంగళూరు జట్టును దక్కించుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ జేఎస్‌డబ్ల్యూ గ్రూపే ఇక్కడా ఢిల్లీ టీమ్ ను రూ.810 కోట్లతో సొంతం చేసుకుంది. ఇక లక్నో ఫ్రాంఛైజీని కొత్త సంస్థ క్యాప్రి గ్లోబల్ రూ.757 కోట్లతో దక్కించుకుంది. మొత్తంగా ఈ వేలం ద్వారా బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది. ఈలీగ్‌ మీడియా హక్కులను వయాకామ్‌ .18 ఇప్పటికే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో లీగ్‌ ప్రారంభం కానుంది.

‘‘ మెన్స్ ఐపీఎల్ 2008 ప్రారంభ రికార్డును బద్ధలు కొడుతూ ఉమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల బిడ్డింగ్ రికార్డ్ ధర పలికిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. బిడ్స్ రూపంలో మొత్తం రూ.4669.99 కోట్లు సమకూర్చుకున్నాం. ఫ్రాంచైజీల విన్నర్లకు అభినందనలు. ఈ పరిణామం మహిళ క్రికెట్‌లో విప్లవానికి నాంది పలుకుంది. బాటలు వేస్తుంది’’ అని జయ్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.