భారత్‌ ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి

భారత్‌ ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం ప్రసంగిస్తూ భారత నాగరికత ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతల్లో ఒకటి. భారతదేశాన్ని ”ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి” అంటారు. అయితే మన ఆధునిక గణతంత్రం యువదశలోనే వుందని చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో మనం అసంఖ్యాకమైన సవాళ్ళను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. సుదీర్ఘ విదేశీ పాలనలోని ఎన్నో దుష్పరిణామాలలో పేదరికం, నిరక్షరాస్యత ప్రధానమైనా, అయినప్పటికీ భారతదేశం అచంచలంగా నిలిచింది. ఇంత భారీ సంఖ్యలో, విభిన్నతతో కూడిన జనసముదాయం ప్రజాస్వామ్యం రూపంలో ఒక జాతిగా కలిసి రావడం అపూర్వం అని ఆమె పేర్కొన్నారు.

 మనమంతా ఒకటేననీ, మనమందరం భారతీయులమనే నమ్మకంతో అలా చేసాం. అనేక మతాలు, అనేక భాషలు మనల్ని విడదీయలేదు. అవి మనల్ని ఏకం చేశాయి. కాబట్టి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మనం విజయం సాధించాం. ఇదే భారతదేశం ప్రత్యేకత అని రాష్ట్రపతి తెలిపారు. శాంతి సౌభ్రాతఅత్వం, సమానత్వం గురించిన మన పురాతన విలువల గురించి తెలుసుకోవడానికి విప్లవకారులు, సంస్కర్తలు దార్శనికులను, ఆదర్శవాదులనూ కలుపుకుపోయారని ఆమె పేర్కొన్నారు.

ఆధునిక భారతీయ ఆలోచనలకు రూపునిచ్చిన వారు, ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల ఆలోచనలను కూడా ఆహ్వానించారని చెబుతూ రాజ్యాంగంలో పొందుపరచబడిన వారి దార్శనికత మన గణతంత్రానికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తోందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.  ఆ సమయంలో భారత్‌ అతిపేద, నిరక్షరాస్యత దేశం నుంచి ప్రస్తుతం ప్రపంచ వేదికపై విశ్వాసం నిండి వున్న దేశంగా రూపాంతరం చెంది ముందుకు వెళుతోందని ఆమె తెలిపారు.

గాంధీజీ గారి ఆదర్శమైన ”సర్వోదయ” అందరి అభ్యున్నతి సాకారమయ్యేందుకు ఇంకా చాలా చెయ్యాల్సి వుందని చెబుతూ గత ఏడాది భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆమె గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ విజయం సాధించామని తెలిపారు.  అత్యంత వేగంగా అభివృద్ధ చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని తెలిపారు.

ప్రభుత్వం సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంటూ ముఖ్యంగా ”ఆత్మనిర్భర్‌ భారత్‌” కార్యక్రమం ప్రజలలో పెద్ద ఎత్తున స్పందన తీసుకు వచ్చిందని, వీటిలో నిర్ధిష్ట ప్రోత్సాహక పథకాలు కూడా వున్నాయని రాష్ట్రపతి చెప్పారు.  పటిష్టమైన పునాదులపై ఆర్థిక వ్యవస్థ నిలబడటంతో మనం పలు ప్రశంసనీయమైన కార్యక్రమాలను ప్రారంభించి, పురోగమించ గలుగుతున్నామని వివరించారు.

ప్రజలంతా వ్యక్తిగతంగానూ, సమిష్టిగానూ, తమ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకుని, అభివఅద్ధి చెందగలిగే వాతావరణాన్ని కల్పించడమే అంతిమ లక్ష్యంగా వుండాలని ముర్ము సూచించారు. ఈ ప్రయోజనాల కోసం విద్య సరైన పునాదులు నిర్మిస్తుంది. ఇందుకుగాను నూతన జాతీయ విద్యా విధానం ప్రతిష్టాత్మక మార్పులు తీసుకువచ్చిందని చెబుతూ జాతీయ విద్యా విధానం రెట్టింపు విద్యా లక్ష్యాలను ఖచ్చితంగా సూచిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం అగ్రగామిగా వుందని అంటూ  ఈ రంగంలో దీర్ఘకాలంగా పెండింగ్‌ లో వున్న సంస్కరణలు అమల్లో వున్నందువల్ల ఇపుడు అందులో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యానికి ఆహ్వానించారని ఆమె కొనియాడారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే ”గగన్యాన్‌” కార్యక్రమం పురోగతిలో వుందని, .ఇది భారతదేశపు మొట్ట మొదటి మానవ అంతరిక్ష నౌక అని ఆమె తెలిపారు.

భారతదేశ మార్స్‌ మిషన్‌ అసాధారణ మహిళల బృందంతో కూడి వుందని అంటూ మన సోదరీమణులు, కుమార్తెలు ఇతర రంగాల్లో సైతం వెనుకబడిలేరని రాష్ట్రపతి స్పష్టం చేశారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం – ఇక ముందు కేవలం నినాదాలుగా వుండవని ఆమె స్పష్టం చేశారు.

ప్రపంచ వేదికపై భారతదేశం సంపాదించిన గౌరవం కొత్త అవకాశాలు పొందడంతో పాటుగా, బాధ్యతలను కూడా కలిగి వుందని అంటూ  ఈ ఏడాది భారతదేశం గ్రూప్‌ ఆఫ్‌ 20 దేశాల అధ్యక్ష పదవి కలిగి వుందని ఆమె గుర్తు చేశారు. సార్వత్రిక సోదర భావం అనే నినాదంతో మనం అందరి శాంతి, శ్రేయస్సు కోసం నిలబడదామని పేర్కొంటూ జి-20 అధ్యక్ష పదవి ప్రజాస్వామ్యాన్నీ, బహు పాక్షికతను ప్రోత్సహించడానికి ఒక అవకాశం అని రాష్ట్రపతి తెలిపారు.

అలాగే మెరుగైన ప్రపంచాన్నీ, మంచి భవిష్యత్తును రూపొందించడానికి సరైన వేదిక కూడా అని చెబుతూ భారత్‌ నాయకత్వంలో జి-20 మరింత సమానమైన, స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు తన ప్రయత్నాలను మరింత మెరుగు పరచగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.