ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు

దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్తవ్య పథ్ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకావిష్కరణ చేశారు. కర్తవ్య పథ్ వద్ద గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి దంపతులు, రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు, కేంద్రమంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం.
 కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో పరేడ్ ఆకట్టుకుంది. ఈసారి ఈజిప్ట్ కు చెందిన సైనిక దళాలు పరేడ్ లో పాల్గొన్నాయి. గణతంత్ర వేడుకల్లో ఈసారి సామాన్యులకు పెద్దపీట వేశారు. రిక్షాకార్మికులు, చిరువ్యాపారులకు పరేడ్ చూసేందుకు అవకాశం కల్పించారు. స్మారక చిహ్నం వద్ద త్రివిధ దళాల అధిపతులు, ప్రధాని, రాజ్‌నాథ్‌సింగ్‌లు నివాళులర్పించారు.
 విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు జవాన్లు కవాతు నిర్వహించారు. పరేడ్ తిలకించేందుకు 45 వేల మంది సందర్శకులు వచ్చారు. ఈ వేడుకల్లో రక్షణ శాఖ శకటాలు అబ్బురపరిచాయి. సందర్శకులను సైనిక, నావిక, విమానయాన శకటాలు అలరించాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం క్రింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొన్నారు.

ఒంటెల దళంతో మహిళలు కవాతు నిర్వహించడం ఇదే మొదటిసారి. వీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందినవారు. సోనాల్, నిషా, భగవతి, అంబిక, కుసుమ్, ప్రియాంక, కౌసల్య, కాజల్, భావన, హీనా తదితరులు ఈ దళంలో ఉన్నారు. అందరూ మహిళలే ఉన్న సీఆర్‌పీఎఫ్-పీస్‌కీపర్స్ ఆఫ్ ది నేషన్ కంటింజెంట్ కూడా కవాతు నిర్వహించింది. దీనికి అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. వుమెన్ ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటవడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మొట్టమొదటిసారి ఓ శకటాన్ని ప్రదర్శించింది. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి వ్యతిరేకంగా ఈ శకటాన్ని తీర్చిదిద్దింది. 35 మంది మహిళా కానిస్టేబుళ్ళతో ఢిల్లీ పోలీస్ వుమెన్ పైప్ బ్యాండ్ ఈ కవాతులో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి

వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 6 మంత్రిత్వశాఖలు, విభాగాలు పాల్గొన్నాయి. దేశ శక్తిసామర్థ్యాలు, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వృద్ధి, మహిళాసాధికారిత వంటి విభిన్న అంశాలను వేడుకల్లో ప్రతిబింబించాయి. ఈ వేడుకల్లో ఎపి శకటం కోనసీమ ప్రబల తీర్థం ఆకట్టుకుంది.

ణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర దీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలు మనకెంతో ప్రత్యేకం. అసమాన త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకారానికి మనమంతా ఐక్యంగా ముందడుగు వేద్దాం… శుభాభినందనలు. నా సోదర భారతీయులందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.