ఆర్ధిక క్రమశిక్షణకై పాక్ లో 10 శాతం ఉద్యోగుల కోత!

సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమేనని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు.  ఎంపీలకు ఇచ్చే వేత‌నాల కోత నుంచి విదేశీ టూర్‌లు, ల‌గ్జరీ వాహ‌నాల కొనుగోలు వ‌ర‌కూ దుబారా ఖ‌ర్చుల‌కు క‌ళ్లెం వేయాల‌ని పాకిస్థాన్ నిర్ణ‌యించింది.  ఇక త‌న ఆర్ధిక స‌మ‌తుల్య‌త‌ను కాపాడుకునేందుకు పాకిస్తాన్ అమెరికా సాయాన్ని అర్ధించింది. ఎన్నిక‌ల‌కు ముందు దేశవ్యాప్తంగా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భ‌గ్గుమంటాయ‌నే భ‌యంతో ఐఎంఎఫ్‌తో ఒప్పందాన్ని ఖ‌రారు చేసుకోవ‌డానికీ పాకిస్తాన్ వెనుక‌డుగు వేస్తోంది.

పాకిస్తాన్‌కు రుణ సాయం విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఐఎంఎఫ్‌ను ఒప్పించాల్సిందిగా పాకిస్తాన్‌లో ప‌ర్య‌టిస్తున్న అమెరికా ప్ర‌తినిధి బృందాన్ని పాక్ ఆర్ధిక మంత్రి ఇషాఖ్ ద‌ర్ కోరారు. వ‌ర‌ద‌లతో పాటు ఆర్ధిక మాంద్యం విసిరిన స‌వాళ్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌తినిధి బృందానికి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్జాతీయ ఒప్పందాలన్నింటికీ పాకిస్తాన్ క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని దేశంలో ఆర్ధిక సుస్ధిర‌త కోసం కఠిన చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని ఆయ‌న అమెరిన్ బృందానికి హామీ ఇచ్చారు. కాగా, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నేషనల్ ఆస్టెరిటీ కమిటీ చేసిన సిఫారసులను పాకిస్థాన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అవి ఏమిటంటే :

 సహజ వాయువు/విద్యుత్తు ఛార్జీల పెంపు; మిలిటరీ, సివిల్ బ్యూరోక్రాట్లకు కేటాయించిన ప్లాట్ల స్వాధీనం; ఎంపీల జీతాల్లో 15 శాతం కోత; ఎంపీల డిస్క్రీషనరీ స్కీములపై నిషేధం; ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు డిస్క్రీషనరీ ఫండింగ్‌పై నిషేధం; ప్రీపెయిడ్ గ్యాస్/ఎలక్ట్రిసిటీ మీటర్ల బిగింపు; జీతంతోపాటు ఇచ్చే అలవెన్స్‌ ఉపసంహరణ;  అన్ని స్థాయుల్లోనూ పెట్రోలు వాడకాన్ని 30 శాతం తగ్గించడం; విదేశీ పర్యటనలపై నిషేధం; విలాసవంతమైన వాహనాల కొనుగోలుపై నిషేధం.

2019లోనే పాక్‌కు 6 బిలియన్ డాలర్లు అందించడానికి ఐఎంఎఫ్ అంగీకరించింది. అయితే అది పెట్టిన కఠినమైన షరతులను అమలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో పాక్ హామీలను నెరవేర్చలేదన్న కారణంగా ఐఎంఎఫ్ దశలవారీగా విడుదల చేసే ఆ రుణాన్ని నిలిపి వేసింది.  గత ఆగస్టులో ఐఎంఎఫ్ బోర్డు పాక్‌కు 1.1 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది.

కాగా ఇప్పుడు పాక్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న రుణ ఒప్పందానికి సంబంధించి తొమ్మిదో సమీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సమీక్ష జరిగితే గత సెప్టెంబర్‌నుంచి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది.

ఇలా ఉండగా, ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నిండా కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులుందరికీ వేతనాల్లో 10 శాతం కోత విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు జియో న్యూస్ కథనం పేర్కొంది. మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను 15శాతం తగ్గించడంతో పాటుగా సలహాదారుల సంఖ్యను 78నుంచి 30కి తగ్గించాలని, మిగతా వారు జీతం లేకుండా పని చేసే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోందని ఆ కథనం పేర్కొంది.