95వ ఆస్కార్ అవార్డ్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట నామినేషన్‌ను దక్కించుకుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ‘లగాన్’ తర్వాత 22 ఏళ్ల అనంతరం మరో భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది.
ఇక వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా వాటిలో నుంచి ఆస్కార్ కమిటీ సభ్యులు తుది జాబితాను ఎంపిక చేశారు.
ఇక మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగనుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కొన్ని రోజుల క్రితమే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకుంది.
అదేవిధంగా భారత్ నుంచి మరో భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో 95వ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించుకుంది. కార్టికి గాన్‌సాల్వ్స్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరినీ 41 నిమిషాల నిడివితో తెరకెక్కించారు. తమిళనాడులోని ముడుమలై టైగర్ రిజర్వ్ నేపథ్యంలో నడుస్తుంది. అడవి, వన్యప్రాణుల పట్ల ఎంతో మమకారం ప్రదర్శించే బొమ్మన్, బెల్లీ దంపతులు రఘు అనే ఆనాథ ఏనుగు సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు.
ఏనుగును సంరక్షించే క్రమంలో ఆ దంపతులు దానితో పెంచుకునే అనుబంధం, ఈ క్రమంలో జరిగే సంఘటనలతో ఈ డాక్యుమెంటరీ మానవీయ కోణంలో సాగుతుంది. ఈ డాక్యుమెంటరీలో అడవి, మనిషి, మూగజీవికి మధ్య ఉండే విడదీయలేని అనుబంధాన్ని దృశ్యమానం చేశారు.
అదేవిధంగా లాస్‌ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్‌లో బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’కు గాను కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి అవార్డును దక్కించుకున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు హాలీవుడ్ ప్రముఖులతో పాటు విదేశీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్‌కాయిస్‌కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?