రిపబ్లిక్ వేడుకలపై కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురు

గవర్నర్ డా. తమిళ్ సై సౌందరరాజన్  పట్ల అవమానకరంగా వ్యవహరించడంలో భాగంగా రిపబ్లిక్ వేడుకలను కరోనా సాకుతో రాజ్ భవన్ కు పరిమితం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. కరోనా సాకుతో రెండేళ్లుగా సాధారణంగా పెరేడ్ గ్రౌండ్ లో జరిపే ఉత్సవాలను జరపకుండా వస్తున్న కేసీఆర్ కు ఈ సారి షాక్ తగిలింది.

గణతంత్ర నిర్వహణ పై హైకోర్టు బుధవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ తో కూడిన గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్న ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవాలను జరపాలని, గణతంత్ర దినోత్సవాలకు ప్రజలను అనుమతించాలని హైకోర్టు తెలిపింది.  కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర దినోత్సవం జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించింది.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించిందని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ చేసి కీలక తీర్పును వెలువరించారు.  5 లక్షల మందితో ఖమ్మంలో నిర్వహించిన సభకు లేని కరోనా నిబంధనలు రిపబ్లిక్ డే వేడుకలకు మాత్రమే వర్తిస్తాయా? అంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు. రిపబ్లిక్ వేడుకలతో జాతీయ భావం పెంపొందించడానికే జాతీయ జెండా పండుగ అని వివరించారు.

కాగా, కరోనావల్ల రెండు సంవత్సరాలుగా పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించలేదని, ఏజీ సమాధానమిచ్చారు. అయితే.. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ఈ సారి మాత్రం రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్నట్టు ఏజీ సమాధానమిచ్చారు.  కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేపు నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అంతకు ముందు, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ తమిళిసై సహితం రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు జరుపుకోవాలన్న లేఖపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా  పేరుతో వేడుకలు జరపకపోవటంపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రాజ్‌భవన్‌లోనే గవర్నర్ జాతీయ పతాకావిష్కరణ చేసిన  అనంతరం గవర్నర్ సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

పుదుచ్చేరిలో గణతంత్ర దినోత్సవంలో పాలొననున్నారని, తెలంగాణలో గణతంత్ర వేడుకలు జరపక పోవడాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి గవర్నర్ తీసుకెళ్లనున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.

కాగా, పరేడ్ గ్రౌండ్ లో ప్రతి ఏడాది జరిపే రిపబ్లిక్ వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం, రాజ్యాంగ స్ఫూర్తికె విరుద్ధమని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే ఇదని మండిపడ్డారు.

గవర్నర్ కు దక్కాల్సిన ప్రోటోకాల్ ను సీఎం కేసీఆర్ పాటించడం లేదని పేర్కొంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించడం లేదని విమర్శించారు. మహిళలంటేనే కేసీఆర్ కు చిన్నచూపు. అందుకే మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.