హైదరాబాద్ యూనివర్శిటీలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనపై విచారణ

హైదరాబాద్ యూనివర్శిటీకి చెందిన ‘ఫ్రాటర్నిటీ మూవ్‌మెంట్’ బిబిసి డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ను శనివారం నార్త్ క్యాంపస్‌లోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శించింది. ఈ ప్రదర్శన పట్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఎబివిపి) తీవ్ర అభ్యంతరం తెలుపడమేకాక, వర్శిటీ పాలకవర్గానికి ఫిర్యాదుచేసింది.

కాగా యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధి, క్యాంపస్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వివరాలు కోరినట్లు తెలిపారు. ఇదివరకే కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ను బ్లాక్ చేయాల్సిందిగా యూటూబ్‌కు, ట్వీట్ లింక్‌లను తొలగించాల్సిందిగా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీచేసింది.

ఇదిలావుండగా ఎబివిపి సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థి బి. శ్రవణ్ రాజ్ మాట్లాడుతూ ‘ఇప్పటి వరకైతే మేము పోలీసుల వద్దకు పోలేదు. ఈ అంశంపై నిరసన ప్రదర్శించలేదు. మేము యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వరకే వెళ్లాము” అని తెలిపారు. ఈ అంశంపై యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిన్ మౌనంగా ఉండటం పట్ల విచారం వ్యక్తం చేశారు.

బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్, డిస్కషన్‌ను ‘ఫ్రాటర్నిటీ మూవ్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్’ చేపట్టింది. డాక్యుమెంటరీ ప్రదర్శనను దాదాపు 70 నుంచి 80 మంది విద్యార్థులు చూశారని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వారు తెలిపారు.