కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళా ‌తీయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ’’సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? అనే వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలి’’అని డిమాండ్ చేశారు.
 
మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో మాట్లాడుతూ 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. మద్యం ద్వారా తెలంగాణలో ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి ఇస్, ఆ ప్రజలకు మాత్రం ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపి గిఫ్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
 
మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా దూసుకెళ్తోందని చెప్పిన సంజయ్ 2047 నాటికి పూర్తిస్థాయిలో ఆర్దికంగా అభివ్రుద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ కుటుంబంపైన, టీఆర్ఎస్ నేతల అవినీతిపై ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా వెల్లడైందని తెలిపారు. ఏ ఆశయం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో… అవి నెరవేరాలంటే ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని పేర్కొంటూ బీజేపీతోనే అది సాధ్యమైతుందని స్పష్టం చేశారు.
 
రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ నీరుగారుస్తున్నరని, గవర్నర్ ను అవమానిస్తున్నడని, అసెంబ్లీకి ఆహ్వానించడం లేదని, బ్యూరోక్రసీ, అధికార వ్యవస్థను పూర్తిగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నడని అంటూ సంజయ్ ధ్వజమెత్తారు.. ప్రజలు ఎక్కడికి వెళ్లాలే తెలియకుండా చేశారని అంటూ చివరకు కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నడని విమర్శించారు.
 
కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని పేర్కొంటూ జాతీయత, జాతీయ భావం లేని పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. దేశభక్తితో జాతీయ భావంతో పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.  కమ్యూనిస్టులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏనాడూ దేశం కోసం ఆలోచించని పార్టీలు…. ఏ విధంగా దోచుకుందామా? ప్రజలను మోసం చేస్తామని కుట్రలు చేసే పార్టీలు అని హెచ్చరించారు.
 
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల దారి మళ్లించేందుకు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నరని సంజయ్ విమర్శించారు. కేసీఆర్… తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎందుకు దివాళా తీయించావో ప్రజలకు సమాధానం చెప్పిన తరువాత మిగిలిన అంశాలపై మాట్లాడాలని, జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ దేశానికి ఏం చేయబోతున్నారో చెప్పాలని స్పష్టం చేశారు.
 
గ్రామ పంచాయతీలకు నేరుగా నిదులు కేటాయిస్తే వాటిని ఏ విధంగా దారి మళ్లించారో కళ్లారా చూశామని చెబుతూ రాష్ట్రం దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆదాయం సంపాదించిందని ఆరోపించారు.  317 జీవో పేరుతో ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోమని సంజయ్ హెచ్చరించారు. ఈనెల 30లోపు ఆ సమస్యను పరిష్కరించాలని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 30న ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున దర్నా చేబడతామని వెల్లడించారు.
 

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్,విజయశాంతి, జి వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.