అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై అక్కడి నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.  దీంతో సాయిచరణ్ శరీరంలోకి పలు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ కాల్పుల్లో సాయిచరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడ్ని చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, బిహెచ్‌ఈఎల్ ఎల్‌ఐసి కాలనీలో నివాసం ఉంటున్న సాయిచరణ్ తల్లిదండ్రులకు అతడి స్నేహితులు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. తమ కుమారుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని తెలియడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. సాయిచరణ్ త్వరగా కోలుకుని స్వదేశానికి తిరిగి రావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బిహెచ్‌ఈఎల్ ఎల్‌ఐసి కాలనీకి చెందిన శ్రీనివాసరావు లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సాయి చరణ్. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్య సిస్తున్నాడు. సోమవారం ఉదయం చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లు తీవ్రంగా సాయిచరణ్ గాయపడ్డాడు.

అయితే, అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని సాయిచరణ్ స్నేహితులు అతని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తన కుమారుడ్ని ఆరోగ్యంగా స్వదేశానికి తీసుకురావాలని సాయిచరణ్ తండ్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  ఉన్నత విద్య కోసం సాయి చరణ్ ఈ నెల11వ తేదీన చికాగోకు వెళ్లాడు. అక్కడ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతనిపై  దుండగులు  కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాయిచరణ్ తోపాటు అతని స్నేహితుడు కూడా గాయపడ్డాడు.