హిందువులు మైనారిటీగా మారితే మనుగడకే ప్రమాదం

దేశంలో భయంకరమైన రీతిలో జనాభా పెరుగుతోందని, దీంతో హిందువులు మైనార్టీలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడిందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా వివరాలు తీసుకుంటే హిందువుల శాతం రోజు రోజుకు తగ్గిపోతుందని తెలిపారు.


ఆదివారం కోటి లోని కార్యాలయంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే హిందువుల జనాభా తగ్గుతోందని చెప్పారు. హిందువులు మాత్రమే కుటుంబ నియంత్రణ చేసుకుంటున్నారని, మిగతా వారు ఎవరు చేసుకోవడం లేదని తెలిపారు.
 
మైనార్టీ సంతుష్ణీకరణ కారణంగానే ఇతర మతాల వారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. హిందువులు కట్టే పన్నుల ఆధారంగా ఇతర మతస్తుల వారు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో మైనార్టీల ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు.
 
హిందువులందరినీ ఐక్యం చేసి, దేశ స్థితిగతులపై చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు. హిందువులందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత విశ్వహిందూ పరిషత్ దేనని ఆయన స్పష్టం చేశారు. హిందువుల ఇళ్లలో పనిచేసే వారు ఇంటి పని, సెక్యూరిటీ.. వాచ్ మెన్.. డ్రైవర్ తదితర వృత్తులు చేసి జీవించే వారందరూ కూడా తమ జీవితంలో దశమ భాగం హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని విమర్శించారు.
 
హిందువుల దగ్గర ఉపాధి పొంది, సంపాదించుకొని, హిందువుల నాశనం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ప్రతి మనిషి వ్యవహారాలను గుర్తించి హిందూ సమాజం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. హిందువులు చైతన్యం కాకపోతే భవిష్యత్తులో భయంకరమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
 
రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ జూన్ మాసంలో వర్షారంబ సమావేశాలు.. జనవరి మాసంలో శీతాకాల సమావేశాలు నిర్వహించి రాబోవు కార్యక్రమాల ప్రకటన, గత కార్యక్రమాల సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై పని చేయాలని సూచించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యకారిణి సభ్యులు రాఘవులు కూడా పాల్గొన్నారు.