ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్‌ చొరబాటు

అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబాటుకు యత్నించటం తీవ్ర కలకలం రేపుతోంది. అతడి రాకను గమనించిన సదరు ఐఏఎస్ అధికారిణి గట్టిగా కేకలు వేయటంతో భద్రతా సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా.. వారు రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ .  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే స్మితా.. తరచూ పలు అంశాలపై ట్వీట్టర్‌లో ట్వీట్లు చేస్తుంది.
 
ఆమె ట్వీట్లను మేడ్చల్ జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్ రెడ్డి అనే డిప్యూటీ తహసీల్దార్ ఒకట్రెండు సార్లు రిట్వీట్లు చేశాడు. ఈ క్రమంలో ఆమెతో తన ఉద్యోగం విషయమై పరిచయం పెంచుకోవాలని భావించాడు. రెండ్రోజుల క్రితం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో సదరు మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్లాడు.
 
తాను ఫలనా ఇంటికి వెళ్లాలని ఎలాంటి భయం బెరుకు లేకుండా చెప్పటంతో అనుమానించని సెక్యూరిటీ అతడిని లోపలికి పంపించారు. నేరుగా ఐఏఎస్ ఇంటికి చేరుకున్న ఆనంద్ కుమార్ రెడ్డి తన స్నేహితుడిన కారులోనే కూర్చోబెట్టి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు.  అర్ధరాత్రి ఎవరు కాలింగ్ బెల్ కొట్టారని సంశయిస్తూనే స్మితా సబర్వాల్ ఇంటి తలుపు తెరిచారు.
 
ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి ఉండటంతో ఖంగుతున్న ఆమె.. మీరు ఎవరు ? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు ? మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారు ? అంటూ అతడ్ని ప్రశ్నించారు. తాను డిప్యూటీ తహసీల్దార్‌ని అని తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని అతడి చెప్పటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వ్యవహారశైలి అనుమానస్పదంగా ఉండటంతో గట్టిగా కేకలు వేశారు.
 
దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంట వచ్చిన స్నేహితుడిని, కారును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ కుమార్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు.
 
ఇదిలా ఉండగా తనకు ఎదురైన అనుభవాన్ని స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకొంటూ  రాత్రి భయంకరమైన అనుభవం ఎదురైందని, ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడని ఆ సమయంలో ఎలా రక్షించుకోవాలని ఆలోచించానని తెలిపింది. ఆ “సమయంలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలో ఆలోచించాను. మీరు సురక్షితంగా ఉన్నారని భావించినా.. ఇంటి తలుపులు, తాళాలను మరోసారి తనిఖీ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయండి” అని ఆమె   సూచించారు.
కాగా.. ఉద్యోగం విషయం గురించి మాట్లాడాల్సి ఉంటే ఏ కార్యాలయానికి వెళ్లకుండా అర్థరాత్రి ఇంటికి వెళ్లటంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. దీని వెనుక కుట్ర ఉందా? అసలు డిప్యూటీ తహసీల్దార్ ఎందుకు వెళ్లాడు? గతంలో ఏం జరిగిందన్నదానిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.