ఆదివాసులే అటవీప్రాంత యజమానులు

ఆదివాసులే అటవీప్రాంత యజమానులని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొంటూ  అటవీ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.
పోడు భూముల సమస్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోడం సిగ్గుచేటని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత -బీజేపీకే దక్కుతుందని చెప్పారు.  నాగోబాను ఆయన దర్శించుకున్న అనంతరం మెస్రం వంశీయుల చందాలతో ఆలయాన్ని నిర్మించడం పట్ల హర్షం ప్రకటించారు. నాగోబా ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఆదివాసీల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని చెబుతూ ప్రతి ఆదివాసీకి ఇళ్లు నిర్మించి ఇచ్చేలా కేంద్రం ప్రణాళిక చేసిందని తెలిపారు.  ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే నాగోబా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో రాగానే..  దేశం అబ్బురపడేలా నాగోబా ఉత్సవాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
జల్ జమీన్ జంగిల్ కోసం ఆదివాసీలు నేటికి పోరాడుతూనే ఉన్నారన్నారని చెబుతూ  పోడు వ్యవవహారంలో బాలింతలను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన సీఎం కేసీఆర్ అని విమర్శించారు.  ఆదివాసీల ఆరాధ్య దైవం, తెలంగాణలోనే  రెండో అతిపెద్దదైన నాగోబా జాతర శనివారం ప్రారంభమైంది. పుష్య అమావాస్యను పురస్కరించుకొని శనివారం రాత్రి 10.30 గంటలకు మెస్రం వంశీయులు తమ ఆచారం ప్రకారం కొత్తగా కట్టిన ఆలయంలో శనివారం అర్ధరాత్రి నాగోబా విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేసి జాతరను ప్రారంభించారు.
 
మొదట ఆలయ మురాడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేస్లాపూర్‌‌‌‌ గ్రామం నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి తీసుకొచ్చారు. మహాపూజతో ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి.  శనివారం అర్ధరాత్రి బేటింగ్‌ (కొత్త కోడళ్ల పరిచయం), 22న జాతర, భక్తుల దర్శనం, ప్రత్యేక పూజలు, 23న ఆదివాసీ దేవుళ్లు పెర్సాపేన్‌, బాన్‌పేన్‌లకు పూజలు, 24న దర్బార్‌ నిర్వహించనున్నారు. 25న బేతాల్‌పూజ, మండగాజలింగ్‌ (ముగింపు కార్యక్రమం)తో జాతర ముగుస్తుంది.