కలెక్టర్ అమోయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలి

మియాపూర్ భూ కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పై సీఎస్  చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 78 కి సంబంధించిన భూముల కేటాయింపులో రంగారెడ్డి జిల్లా అమోయ్ కుమార్  పక్షపాత ధోరణి చూపించారని ఆయన విమర్శించారు.

 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం..40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. కలెక్టర్ అమోయ్ కుమార్ అందరికీ ఒక న్యాయం  చేయరా? అని నిలదీశారు. తమ లేఖను ఫిర్యాదుగా పరిగణించి కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన కోరారు. 

తమకు 10 రోజులు సమయమిస్తే మియాపూర్ భూ కుంభకోణంపై మరింత సమాచారం ఇస్తామని రఘునందన్ రావు తెలిపారు. తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని రఘునందన్ రావు విమర్శించారు. సర్వే నంబర్ 78కి సంబంధించిన భూమిని ఇతరులకు కేటాయించడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.

కాగా, ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ లపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశానని రఘునందన్ రావు తెలిపారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయానికి, డీఓపీటీకి కూడా  లేఖ రాశామని చెప్పారు. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు తెలంగాణలో పనిచేస్తున్నారని ఆరోపించారు.

ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు అక్కడే పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటే ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాల్లో పంపించాలని ఆయన కోరారు. డీజీపీని కూడా ఏపీ కేడర్ కు కేటాయించారని పేర్కొంటూ ఆయనను కూడా అక్కడికే పంపించాలని డిమాండ్ చేశారు.

ఐఏఎస్ ల కేటాయింపు కేసుపై ఈ నెల 27న హైకోర్టులో  విచారణ జరుగుతుందని చెప్పారు. 13 మందిపై 13 సార్లు వేర్వేరుగా పిటిషన్లు, తీర్పులతో సమయం వృథా కాకుండా ఈ కేసు మొత్తాన్ని ఒకటిగా పరిగణించి తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. బ్యూరోక్రాట్స్‌కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలని, ఈ విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ ‘క్యాట్’ పేరు మీద సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 15 మందిని పంపకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు.