కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ల ప్రక్రియ నిలిపివేత

గత పక్షం రోజులుగా రైతులు జరుపుతున్న ఆందోళనలకు ప్రభుత్వం దిగివచ్చింది.   రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్‌లను రద్దు చేస్తూ ఆయా పట్టణాల కౌన్సిళ్లు తీర్మానం చేశాయి. వీటి రద్దు కోసం కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కార్యవర్గాలు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించడంతో పాటు మాస్టర్‌ప్లాన్ ముసాయిదా తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్ణయించాయి.

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై 60 రోజుల్లో 2,396, జగిత్యాల మాస్టర్‌ప్లాన్ వెయ్యికిపైగా అభ్యంతరాలు రావడంతో వీటిని రద్దు చేసి కొత్తగా మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, నిరసనల మేరకు మాస్టర్ ప్లాన్‌ల ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు.

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల గురించి చర్చించారు. కామారెడ్డి పట్టణంలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అందరి సమన్వయంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అరవింద్ కుమార్ తెలిపారు.

రైతుల భూమి సేకరణ చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన తెలిపారు. రైతుల భూములు ఎక్కడికి పోవని ఆయన సూచించారు. వ్యవసాయ భూముల్లో కొత్త రోడ్ల నిర్మాణం రైతులకు నష్టం జరగకుండా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్‌ను రద్దు చేస్తూ కౌన్సిలర్లు తీర్మానాన్ని ఆమోదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ప్రత్యేకంగా సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ముసాయిదా తాము రూపొందించింది కాదని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవి తెలిపారు. ఉన్నతాధికారులకు ఈ తీర్మానం పంపుతామని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు జగిత్యాల పట్టణంలోనూ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ మున్సిపల్ కార్యవర్గం తీర్మానం చేసింది. అత్యవసర సమావేశం నిర్వహించి కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు.

మాస్టర్ ప్లాన్ లను రద్దు చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం ప్రకటించారు. ఇది రైతుల పోరాట విజయం అని తెలిపారు. కామారెడ్డి, జగిత్యాల రైతాంగం చూపిన పోరాట పటిమ అందరికి ఆదర్శం అని పేర్కొంటూ వారి స్పూర్తితో కేసీఆర్ సర్కార్ అవినీతి పాలన అంతమయ్యేదాకా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.