ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుండి జరగనున్నాయి. మధ్యాహ్నం 12. 10 నిమిషాలకు సమావేశాలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం సమాచారం పంపిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2న మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపి, 3న మధ్యాహ్నం 12.10 గంటలకు ఏక కాలంలో ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించనుంది.

ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 2023 – 24 వార్షిక బడ్జెట్ కి సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహా అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్థికశాఖ అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి బడ్జెట్ కు తుదిరూపునిస్తోంది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో భారీగా కేటాయింపులు చూపే అవకాశం ఉంది.

 2022 -23 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,56,958 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు హామీ ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీ పూర్తి చేసేందుకు ఈ సారి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే,  దళిత బంధు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్ల కోసం అధిక మొత్తంలో నిధుల కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖకు వచ్చిన బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలను శాఖల వారీగా సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ ప్రతిపాదనల ఆదారంగా రాష్ట్ర వార్షిక బ డ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చనని తెలుస్తోంది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా  ప్ర భుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు మాత్రమే దాటినట్టు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉ న్నాయి. అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్లు మించకపోవచ్చని భావిస్తున్నారు.