సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రముఖ నేత కుమారుడి బండారం!

సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే మంటలు ఎగిసిపడుతుండటం, పొగ దట్టంగా వ్యాపించడంతో రెస్క్యూ కష్టంగా మారింది.  భారీగా మంటలు ఎగిసిపడటం, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటికీ డెక్కన్ మాల్‌లో మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి కూడా సెల్లార్‌లో ఇంకా స్వల్పంగా మంటలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఐదు ఫ్లోర్లకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశముందని అధికారులు అంటున్నారు. మరోవైపు బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిలో ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించారు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండిపోయిన మరో ముగ్గరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. వారిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. సహాయక సిబ్బంది ఆ అంతస్థులోకి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేసినా మంటలు ఎగిసిపడుతుండటంతో సాధ్యం కాలేదు. 
 
వసీద్, జునైద్, జహీర్ అనే ముగ్గురు యువకులు షటర్స్ తీసేందుకు లోపలికి వెళ్ళి ఘటన సమయంలో మంటలో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో కాలిబూడిద అవడంతో మృతదేహాలను క్లూస్ టీం అధికారులు పరిశీలిస్తున్నారు. ఎఫ్ ఎస్ ఎల్ ,డిఎన్ఎ రిపోర్టు ఆధారంగా మృతదేహాల అవశేషాలను గుర్తించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇలా ఉండగా, నిబంధనలకు విరుద్దంగా భవనం నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. రెసిడెన్షియల్ భవనాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్వాహకులు మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఓ ప్రముఖ నేత కుమారుడు బిల్డర్‌గా మారి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఇప్పుడు బైటపడింది.
 
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. బిల్డింగ్ యజమాని జి+4 అనుమతులు తీసుకోగా, మరో రెండు అంతస్తులను అదనంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను కమర్షియల్ బిల్డింగ్‌గా మార్చుకునేందుకు అధికారులు కూడా సహాకారం అందించినట్లు తెలుస్తోంది.
 
భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన భవనంలో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగడంతో.. రాత్రి 9.30 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
 
 కాగా డెక్కన్ మాల్ ప్రమాదంపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టారని భవన యజమాని మహ్మద్, రహీంలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరో ముగ్గురు మిస్సైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గురువారం మొత్తం 40 ఫైర్ ఇంజన్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఆదాయం కోసం అక్రమ నిర్మాణాలకు అనుమతివ్వొద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు.  సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను కిషన్ రెడ్డి పరిశీలించిన ఆయన ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని చెప్పారు.  చట్ట వ్యతిరేక  గోడౌన్ లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలేనని తెలిపారు.  బడ్జెట్ కోసం ప్రభుత్వం  అక్రమ కట్టడాలను  రెగ్యులరైజ్ చేస్తుందని ఆరోపించారు.