తమ వీరోచిత విన్యాసాలను ఏకరువు పెట్టిన సైనికాధికారులు

భారతదేశ వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి మిగ్ 29 యుద్ధ విమానాన్ని 1.9 మ్యాక్‌ల వేగం అంటే శబ్ధవేగానికి రెండింతల స్థాయి వేగంతో దూసుకుపోనిచ్చారు. ఈ వేగంతో విమానం దూసుకుపోతున్న దశలో పై కప్పు ఎగిరిపోయిన దశలోనే అత్యంత చాకచక్యంగా దీనిని గమ్యస్థానానికి చేర్చారు.

 అదే విధంగా పదాతిదళం, నౌకాదళం ప్రధానాధికారులు కూడా తమ వీరోచిత విన్యాసాల క్రమాన్ని సగర్వంగా ఏకరువు పెట్టుకుంటూ ఓ పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3 పేరిట వెలువడ్డ ఈ పుస్తకంలో ఈ ముగ్గురు తమ అత్యంత అరుదైన పది సాహస ఘట్టాలను పొందుపర్చారు.

మిగ్ 29తో ఓ ఆటాడుకున్న ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి తాను మిగ్‌ను భూమికి 12.3 కిలోమీటర్ల ఎత్తున అత్యంత వేగంగా, శబ్ధ వేగాన్ని మించిపోయి నడిపిన అనుభవాన్ని చాటారు. ఈ దశలో వెలుపలి ఉష్ణోగ్రతలు మైనస్ 53 డిగ్రీలు ఉన్నాయని తెలిపారు. గడ్డకట్టుకుపోయే చలి వాతావరణంలో ఈ స్పీడ్‌లో మిగ్‌ను నడపడం, శబ్ధ వేగాన్ని మించిపోయిన దశలో రగిలే వేడితోనే సాధ్యమని చమత్కరించారు.

తమ సాహసాలతో వెలువడ్డ పుస్తకావిష్కరణ దశలో త్రివిధ బలగాల అధిపతులు మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ సభకు పలువురు సీనియర్ సైనికాధికారులు, సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులు, విభిన్న రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. తన మిగ్ 29 అనుభవాన్ని ఆయన వివరిస్తూ ‘ వెలుపలి వాతావరణం, అత్యంత తీవ్రస్థాయి వేగం కారణంగా కాక్‌పిట్‌పై ఉండే రక్షణ కప్పు ఎగిరిపోయింది.

ఈ దశలో అత్యంత కీలకమైన సమయస్ఫూర్తిని వినియోగించుకుని, కేవలం ఆరు సెకండ్ల వ్యవధిలోనే నిర్ణయం తీసుకుని విమానాన్ని ఏటవాలు స్థితికి తీసుకువచ్చి నడిపించాను. గంటకు 1700 కిలోమీటర్ల వేగంతో మిగ్ సాగిపోతున్న దశలో పడుకున్న స్థితిలోకి వచ్చి గాలి వాటు తగలకుండా చేసుకుని వీలుచూసుకుని విమానం చివరికి గమ్యం చేరేలా చేశాను’ అని వివరించారు.

నౌకాదళాల ప్రధానాధికారి ఆర్ హరికుమార్ తమ అనుభవం గురించి తెలియజేశారు. విమాన వాహక నౌక నుంచి ప్రయోగించిన యుద్ధ విమానాలు సముద్రాలపై సాగించే ప్రతి విన్యాసం వీటిని నడిపే వారికి సవాలు దీనితో పాటు ఓ అనుభవం అన్నారు. ఓ సారి జరిపిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక విన్యాసాల దశలో విమానాలు దాదాపుగా పూర్తిస్థాయిలో ఇంధనం అయిపోయిన దశలో గమ్యాలు చేరాయని తెలిపారు.

ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ సైనికులు ఎప్పుడూ తాము తినే ఉప్పు, తాము గడించే పేరు, తాము ఎంచుకునే లక్షం, గుర్తింపు మీదనే దృష్టి పెట్టుకుంటారని, ఈ క్రమంలో సాగే విధి నిర్వహణల్లో తమ ప్రాణాలను కూడా లెక్కచేయరని తెలిపారు. దేశం కోసం సాగాలనే తపనే వీరిని ఎటువంటి వీరోచిత పనులకు అయినా పురికొల్పుతుందని పేర్కొన్నారు.

చావు ముంగిట్లో నిలిచినా పరిస్థితికి వెరవకుండా ముందుకు వెళ్లుతారని తెలిపారు. ఏళ్ల తరబడి శిక్షణ , గడ్డు పరిస్థితులను తరచూ ఎదుర్కొంటూ పోవడం, తమకు ముందు పనిచేసిన తోటి వీర సైనికుల వీరోచిత సాహసాలను సైనికులు స్ఫూర్తిగా తీసుకుంటారని జనరల్ పాండే తెలిపారు. భారతదేశపు వీరోచిత త్రిమూర్తుల ఈ పుస్తకంలో ఇటువంటి పలు అంశాలను పొందుపర్చారు. ఈ పుస్తకాన్ని ఓ పత్రికకు చెందిన రక్షణ వ్యవహారాల కరెస్పాండెంట్లు శివ్ అరూర్, రాహుల్ సింగ్‌లు రూపొందించారు. సైనికుల వీరగాధలకు సంబంధించిన సీరిస్‌లో ఇది మూడవ పుస్తకం.

 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ భారత్, చైనా సైనికులను సరిసమానంగా భారతీయ ఆర్మీ చికిత్సలు జరిపించడం , అరేబియా సముద్రంలో తౌక్తే తుపాన్ దశలో భారతీయ నావికాదళం వందలాది మందిని రక్షించడం, రెండు సెకండ్లలో విమానం నేలకు పతనం అయ్యే దశలో ఓ భారతీయ పైలెట్ సురక్షితంగా బయటపడటం వంటి గాధలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.