ఇప్పట్లో పాక్ ను ఆదుకోగలిగింది భారత్ మాత్రమే!

అణుబాంబు ఉందని బడాయిగా చెప్పుకుంటూ, తమ ప్రజలకు ప్రధాన ఆహారం అయిన గోధుమ పిండిని సైతం అందుబాటులో ఉంచలేని దుస్థితిలో పాకిస్థాన్ ను ప్రస్తుతం ఆదుకోగలిగింది భారత్ మాత్రమే అని ఆ దేశ నిపుణులు మాత్రమే కాకుండా, మిత్రత్వం వహిస్తున్న ముస్లిం దేశాలు సహితం స్పష్టం చేస్తున్నాయి. వరద బీభత్సం నుంచి సాధారణ స్థితికి చేరాలంటే కేవలం భారత దేశంతో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడం ఒక్కటే మార్గమని ఆ దేశ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
 
మందులు, కూరగాయలు, బియ్యం, గోధుమలు వంటివాటిని దిగుమతి చేసుకోవడం కోసం ఇప్పటికే ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది. వాఘా-అట్టారీ, ఖోఖ్రపార్-మునబావ్ సరిహద్దు మార్గాల ద్వారా సులువుగా వ్యాపారం చేయవచ్చునని ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ మధ్య ఆ దేశ  ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ తో శాంతిని కోరుకొంటున్నట్లు పదే పదే చెబుతున్నారు.
 
విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి పోతుండటంతో ఈ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , సౌదీ అరేబియాల సాయాన్ని అర్థించగా ‘విధానాలను సమీక్షించుకోండి, పొరుగు దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోండి’ అంటూ ఆ దేశాలు హితవు చెప్పాయి. ముఖ్యంగా భారత దేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని పరోక్షంగా చెప్పాయి.
 
అందుకే షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ, మూడు యుద్ధాలు చేసిన తర్వాత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారని, తమకు బుద్ధి వచ్చిందని, భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని అంటూ చెంపలు వేసుకొన్నంత పని చేస్తున్నారు. యూఏఈ, సౌదీ అరేబియాల నుంచి 4 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సాయం పొందాలని షరీఫ్, మునీర్ ప్రయత్నించారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుండటంతో దేశం డిఫాల్ట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ సాయం అవసరమని వారు తెలిపారు. కానీ యూఏఈ మాత్రం సున్నితంగా ఓ సలహా ఇచ్చింది. విధానాలను సమీక్షించుకుని, పొరుగు దేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలని స్పష్టం చేసింది. భౌగోళిక ఆర్థిక వ్యవస్థ, వ్యూహాత్మక సహకారాలను బలోపేతం చేసుకోవడం కోసం భారత్, ఇజ్రాయెల్, అమెరికాలతో యూఏఈ బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంది.

 2022లో ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ ప్రాంతంలో భద్రతా విధానాల కారణంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి బలమైన మద్దతుదారులను పాకిస్థాన్ కోల్పోతోంది. పాకిస్థాన్ మీడియా కూడా ఆ దేశ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తోంది. భారత దేశం రోజు రోజుకూ అభివృద్ధి సాధిస్తూ ఉంటే, పాకిస్థాన్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోందని, ప్రధాని షరీఫ్ ఆర్థిక సహకారం కోసం ప్రపంచాన్ని అర్థిస్తున్నారని విమర్శిస్తోంది.

=పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మారిపోయి, షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ డిఫాల్ట్ అయ్యే పరిస్థితిని తప్పించడం కోసం షరీఫ్ పోరాడుతున్నారు. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ వద్ద కేవలం 4.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. అవసరమైన దిగుమతుల కోసం ఈ సొమ్ము కేవలం రెండు, మూడు వారాలపాటు మాత్రమే సరిపోతుంది. ద్రవ్యోల్బణం పెరగడం, పాకిస్థానీ రూపాయి విలువ తగ్గడం వల్ల సైన్యానికి బడ్జెట్ కేటాయింపులను 2022-23లో ఆ దేశ జీడీపీలో 2.8 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గించారు.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైనికులకు రోజుకు రెండు పూటల భోజనం పెట్టే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు 2002 నుంచి తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్, ఇతర ఉగ్రవాద సంస్థలతో పోరాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆదుకుంటుందని అనుకుంటే, ఇటీవల శ్రీలంకలో సైనిక బడ్జెట్‌లో భారీ కోత విధించినట్లుగానే పాకిస్థాన్ సైనిక బడ్జెట్‌లో కూడా కోత విధించాలని ఐఎంఎఫ్ డిమాండ్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. 2022లో సంభవించిన వరదలు పాకిస్థాన్‌ను అతలాకుతలం చేశాయి. సాగు భూమి తీవ్రంగా దెబ్బతింది. పంటలు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం సుమారు 40 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ప్రజలకు తగిన స్థాయిలో కూరగాయలు, బియ్యం, గోధుమలు అందుబాటులో లేవు. డాలర్ల నిల్వలు లేనందువల్ల వీటిని దిగుమతి చేసుకోవడం కూడా సాధ్యం కాదు.

ప్రాణాలను కాపాడగలిగే ఔషధాలు కూడా తక్కువగానే అందుబాటులో ఉన్నాయి. మధుమేహ రోగులకు ఇన్సులిన్ వంటివాటి కొరత తీవ్రంగా ఉంది. కరాచీ వంటి నగరాల్లో కూడా ఈ దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయి. డాలర్లు లేకపోవడంతో పాకిస్థానీ స్టేట్ బ్యాంక్ లెటర్ ఆఫ్ క్రెడిట్‌‌ను జారీ చేయడం లేదు.

దీంతో చైనా, భారత్, అమెరికా, యూరోపు దేశాల నుంచి ఈ ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకుండాపోయింది.అన్ని వేళలా మిత్ర దేశంగా వ్యవహరిస్తున్న చైనా కూడా సహాయడటానికి ముందుకు రావడం లేదు. బలూచిస్థాన్‌లో మిలిటరీ ఔట్‌పోస్ట్‌ల ఏర్పాటు విషయంలో తమ డిమాండ్లపై పాకిస్థాన్ వైఖరి చైనాకు మింగుడుపడటం లేదు.