బీజేపీలో పంజాబ్ కీలక కాంగ్రెస్ నేత మన్‌ప్రీత్

పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాను రాజకీయాలను భారత్ కు సేవచేసే అవకాశంగా భావిస్తున్నానని, చెప్పారు అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల కుమ్ములాటల్లో మునిగిపోయిందని చెప్పారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మన్‌ప్రీత్ ను బిజెపిలోకి ఆహ్వానిస్తూ పంజాబ్ లో తొమ్మిది బడ్జెట్ లను ప్రవేశపెట్టారని, ఆయనను ఎప్పుడు కలిసినా పంజాబ్, భారత దేశం పట్ల నిజమైన ఆర్థత గల నేతగా కనిపిస్తుండేవారని కొనియాడారు. మన్‌ప్రీత్ బీజేపీలో చేరడం పంజాబ్ రాజకీయాలలో మరో మలుపు కానున్నదని బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ చెప్పారు.

అంతకు ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పార్టీలో వర్గ పోరు తీవ్రంగా ఉందని మన్‌ప్రీత్ ఆరోపించారు. ఢిల్లీలోని కోటరీయే పంజాబ్‌లో వ్యవహారాలను చక్కబెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను నిర్వహించే తీరు, నిర్ణయాలు తీసుకునే పద్ధతి, మరీ ముఖ్యంగా పంజాబ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని చెప్పారు.

ఇలా చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం ఆదేశాలను పంజాబ్‌లోని పార్టీ విభాగం పాటించే విధంగా చేయడానికి నిర్దేశించిన కోటరీ సమర్థవంతమైనది కాదని ఆరోపించారు.

ఇప్పటికే తలో దారిలో నడుస్తున్న పార్టీ నేతల మధ్య విభేదాలను తగ్గించడానికి ప్రయత్నించడానికి బదులుగా, ఈ కోటరీ పెద్దలు వర్గ పోరును మరింత పెంచడానికి కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీలోని అత్యంత చెడ్డవారిని బలోపేతం చేయడాన్ని ఓ విధానంగా మార్చుకున్నారని మండిపడ్డారు. పార్టీలో తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని తెలిపారు.

పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు మన్‌ప్రీత్ బాదల్ సమీప బంధువే. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో మన్‌ప్రీత్ పాల్గొనడం లేదు. పీసీసీ చీఫ్ అమరందర్ సింగ్ రాజాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.