ఫిబ్రవరి 16, 17లలో త్రిపుర‌, మేఘాల‌యా, నాగాలాండ్‌ ఎన్నిక‌లు

త్రిపుర‌, మేఘాల‌యా, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఇవాళ కేంద్రం ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. త్రిపుర‌లో ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన‌, మేఘాల‌యా, నాగాలాండ్‌లో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. మూడు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చి 2వ తేదీన ప్ర‌క‌టించ‌నున్నారు.
 
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు.  నాగాలాండ్‌, మేఘాల‌యా, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీలు వ‌రుస‌గా మార్చి 12, 15, 22వ తేదీల్లో ముగియ‌నున్న‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్ర‌తి రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.
 
ఈ మూడు రాష్ట్రాల్లో 62.8 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 1.76 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు తొలిసారి ఓటు వేయ‌నున్నారు. 376 పోలింగ్ బూత్‌లు మ‌హిళా సిబ్బంది ఆధీనంలో ఉండ‌నున్నాయి. ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.   నాగాలాండ్ అసెంబ్లీ కాల పరిమితి మార్చి 12న ముగుస్తుండగా.. మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ గడువు మార్చి 15, 22న పూర్తికానుంది. మార్చ్ నెలఖరులోగా ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
 
త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. నాగాలాండ్‌ను నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ పరిపాలిస్తోంది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. జాతీయ గుర్తింపు పొందిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏకైక పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ కావడం గమనార్హం. నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు చొప్పున ఉన్నాయి.
 
ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌ కి తెలియజేయవచ్చునని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామని రాజీవ్ కుమార్  చెప్పారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.