కల్వకుంట్ల కుటుంబం.. ఫాం హౌజ్‌కు పరిమితం

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ఫాంహౌజ్‌కు పరిమితం కావడం ఖాయమని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్డుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారని తెలిపారు.
 
 ఇందుకోసం 2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని చెప్పారు. ఈ రెండ్రోజుల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు రానున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు  జేపీ నడ్డా  నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
 
సమావేశాల ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని చెబుతూ ప్రస్తుతం పార్టీ ఆధర్వ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారని తెలిపారు. 2047 వరకు నిర్దేశించుకున్న అమృత కాలాన్ని ప్రస్తావిస్తూ.. మన పూర్వీకుల ఆకాంక్షలను పూర్తిచేసేందుకు సరైన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాలకు కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారని పేర్కొన్నారు.
 
రాబోయే సంవత్సరాల్లో ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని ప్రధాని మార్గదర్శనం చేశారని చెప్పారు. కాగా, దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కుందని, కానీ ప్రజల ఆకాంక్షలను వదిలిపెట్టి రాజకీయాలు చేస్తే ఆ ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
 
 టీఆర్ఎస్ పార్టీ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం లేదని పేర్కొంటూ రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిన కుటుంబం.. దేశాన్ని దోపిడీ చేద్దామని అనుకుంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీకి భూమి కదిలిపోతోందని, అలాంటిది దేశ రాజకీయాల్లోకి వచ్చి కల్వకుంట్ల కుటుంబం సాధించేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు.