రాజకీయాలు తనతో చేయలేక తన కొడుకుపై కేసులు పెట్టి రాజకీయం చేస్తున్నారని బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో తోటి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారంటూ సంజయ్ కుమారుడు భగీరథ్‌పై కేసు నమోదు చేయడంపై బీజేపీ నేతలు ఎన్ ఇంద్రసేనా రెడ్డి, డా. మనోహర్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడాడుతూ ధ్వజమెత్తారు.
ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు భగీరథ్ చేయి చేసుకున్నాడని, ఈ విషయాన్ని దాడికి గురైన విద్యార్థే స్వయంగా ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. ఇప్పుడు ముగ్గురి జీవితాలు నాశనం చేయడం కోసం ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సరే ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు నాన్-బెయిలబుల్ కేసులు పెట్టారని విమర్శించారు.
ఒకప్పుడు కేసీఆర్ మనవడి గురించి తప్పుగా మాట్లాడితే తానే ఖండించానని గుర్తు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని చిన్నపిల్లలను వివాదాల్లోకి లాగొద్దన్న ఇంగితం తనకుందని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ తనతో రాజకీయం చేయాలని, పిల్లలతో కాదని హెచ్చరించారు. చదువుకునే పిల్లలు కొట్టుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతుంటారని, ఇందులో కేసీఆర్‌కు వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు.
కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని సంజయ్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగితే ముందు విద్యార్థి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేయాలని, అదేదీ చేయకుండా నేరుగా క్రిమినల్ కేసులు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసని మండిపడ్డారు. తన కొడుకుని తానే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తానని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. లేక లాఠీలతో కొడతారా..? ఏం చేస్తారో చూస్తాం అంటూ సవాల్ చేశారు.
తాను తలచుకుంటే కేసీఆర్ మనువడు చేసినవన్నీ బయటపెట్టగలనని హెచ్చరించారు. తాను చేస్తున్నది కరెక్టేనా అని కేసీఆర్ తన భార్యనో, కోడలినో అడిగితే చెబుతారని సంజయ్ హితవు పలికారు. దెబ్బలు తిన్న విద్యార్థి ఫిర్యాదు చేశాడా? లేక, వేధింపులకు గురైన విద్యార్థిని ఫిర్యాదు చేసిందా? అంటూ సంజయ్ ప్రశ్నించారు.
కాగా, యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి లాభం గడిస్తున్నామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటని సంజయ్ విమర్శించారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ హిందూ దేవుళ్లను కించపరుస్తుంటే నోరెందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. ఆలయాలను, దేవుళ్లను కూడా వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు