రూ. 4,000 కోట్ల మియాపూర్ భూ కుంభకోణంలో తోట చంద్రశేఖర్!

ఇటీవల బీఆర్ఎస్ లో  చేరగానే కేసీఆర్ ఏపీ అధ్యక్షుడుగా నియమించిన తోట చంద్రశేఖర్  సుమారు రూ. 4,000 కోట్ల మియాపూర్ భూ కుంభకోణం ఉన్నాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.  మియాపూర్ లో  సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని వెల్లడించారు.
 
దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్  తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు.  భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని  రఘునందన్ రావు  డిమాండ్ చేశారు.  మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్  తోట చంద్రశేఖర్ భూములపై  ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.
 
వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం, తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా? అని నిలదీశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభ కోణాలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఆఫీసర్లంటే ప్రేమ ఎక్కువని అంటూ బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.
 
“రూ.4 వేల కోట్ల మియాపూర్ భూములను తోట చంద్రశేఖర్‌కు కేసీఆర్ అప్పగించారని ఆరోపణలున్నాయి సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగింది. ఉద్యమంలో రాక్షసులైన ఆంద్రోళ్లు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలి ?” అని స్పష్టం చేశారు. 
 
ఆ భూములను తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పచెప్పారని, ఆ 40 ఎకరాలు అమ్మి రూ. 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని, ఏపీకి అధ్యక్షుడిని చేశారని  విమర్శించారు. మియాపూర్  భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు.
 
ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని స్పష్టం చేశారు.  కేసీఆర్‌కు గతంలో దొంగలుగా కనిపించిన ఆంధ్రవాళ్లు.. ఇప్పుడు బంధుమిత్రులుగా మారిపోయారని రఘునందన్‌రావు విస్మయం వ్యక్తం చేశారు. చెప్పుచేతల్లో పెట్టుకొనేందుకు నేరుగా రిక్రూట్ అయినవారిని కాకుండా కన్ఫర్మ్ ఐఏఎస్ లనే జిల్లా కలెక్టర్లుగా నీయమిస్తున్నారని తెలిపారు.
 
కాగా, తెలంగాణ అస్తిత్వాన్ని సిఎం కెసిఆర్ దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని ఆయన ఖండించారు.