విజయవాడ, తిరుపతి, బెంగూళూరు మధ్య వందే భారత్!

ఈ నెల 15న తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత వేగంతో నడిచే అత్యాధునిక సదుపాయాలతో కూడిన  తొలి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. రెండో దశలో భాగంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, బెంగూళూరు మధ్య సర్వీసులు అందించేలా వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
 
తొలి విడతలో భాగంగా దేశంలోని 75 నగరాలను అనుసంధానిస్తున్నామని, ఇది పూర్తైన తర్వాత రెండో దశ ప్రారంభం అవుతుందని చెప్పారు. రెండో దశలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని నగరాలకు కనెక్ట్ అయ్యేలా వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.  త్వరలో సికింద్రాబాద్, విజయవాడ మధ్య ట్రాక్ సామర్థ్యాన్ని 160 కిలోమీటర్లకు పెంచబోతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
 
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్నామని, అది పూర్తైన తర్వాత జీఎంను నియమిస్తామని తెలిపారు. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలుతో 30 నగరాలను అనుసంధానం పూర్తయిందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. త్వరగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్లే వందే భారత్ ట్రైన్లలో అధిక ఛార్జీలు ఉన్నాయని చెప్పారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలు భావిస్తున్నారని, వందే భారత్ ట్రైన్ల వల్ల అది సాధ్యమవుతుందని తెలిపారు.
 
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ట్రైన్ వల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు మూడు గంటల్లో, విశాఖపట్నంకు 8.30 గంటల్లో చేరుకోవచ్చు. 1128 సీట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వైఫై సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు, రెస్ట్ రూమ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉండటంతో.. ఛార్జీలు ఎక్కువైనా వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు