చంద్రబాబుపై పోటీకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్!

`వై నాట్ 175… కుప్పంతో సహా’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ అంటుండడం అధికార పక్షం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈ సారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. ఆ నియోజకవర్గ బాధ్యతలను మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పచెప్పిన తర్వాత జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టిడిపి ఓటమి చెందడంతో వైసిపి నాయకులలో ఉషారు పెరిగింది.

విద్యార్థి దశనుండి, సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న చంద్రబాబు – పెద్దిరెడ్డి బహుశా మొదటిసారిగా ఒకరిపై మరొకరు నేరుగా సవాళ్లు వేసుకోవడం జరుగుతుంది. తాజాగా, సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పం నుండి పోటీ చేసి చంద్రబాబును ఓడించడానికి తాను సిద్ధం అని డా. పెద్దిరెడ్డి సవాల్ చేయడం రాజకీయాలలో కలకలం రేపుతోంది.

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తాం అంటూ వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమే అంటూ స్పష్టం చేశారు. తాను కుప్పంలో పోటీ చేసి నెగ్గడానికి సిద్ధంగా ఉన్నానని.. మరి చంద్రబాబు పుంగనూరులో తనపై పోటికి సిద్దామా? అంటూ ఎదురు సవాల్ చేశారు.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో తమ పార్టీ ఫ్లెక్సీ లను తొలగించారని ప్రశ్నిస్తే వారిపై దొంగ కేసులు పెట్టించి, సంక్రాంత్రి పండుగ సమయంలో జైలులో ఉంచుతారా అంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చే సంక్రాంత్రికి ఎక్కడ ఉంటావో ఆలోచించుకో అంటూ చంద్రబాబు హెచ్చరించడంతో వీరిద్దరి మధ్య ఈ వివాదం చెలరేగింది.

పీలేరు జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓటమి పాలు చేస్తానంటూ సవాల్ విసిరారు. అందుకు సమాధానంగా తానే కుప్పంలో పోటీ చేస్తా అంటూ మంత్రి మరో సవాల్ విసిరారు.