కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి కేంద్రం సూచన

సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు ఓ లేఖ రాశారు. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిని చేర్చుకోవాలని ఆ లేఖలో సూచించారు.
 
ఇలా చేయడం వల్ల 25 ఏండ్ల క్రితం ఏర్పాటైన ప్యానెల్‌లో పారదర్శకతతోపాటు జవాబుదారీని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఇదే కిరణ్‌ రిజిజు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆరోపణలు చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాలతో పాటు బదిలీల  ప్రక్రియను ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కొలీజియం చూస్తున్నది. కాగా, ఈ విధానంపై గత కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అన్ని వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదనే అపవాదును కూడా కొలీజియం మూటగట్టుకున్నది.

ఇదే సమయంలో ఎలాంటి రాజకీయలకు తావులేకుండా న్యాయమూర్తుల నియామకాలు జరుగుతున్నాయనే మంచి పేరును కూడా పొందింది. అయితే, కొలీజియంలో పారదర్శకత కరువైందని, జవాబుదారీతనం లేదని, ముఖ్యంగా అన్ని వర్గాలకు న్యాయమూర్తుల నియామకంలో తగు ప్రాతినిధ్యం లభించడం లేదని విమర్శలు కొంతకాలంగా చెలరేగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చేందుకు చర్చలు చేపట్టింది. దీనిలో భాగంగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని కొలీజియంలో భాగస్వామ్యం చేయడం ద్వారా పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం వస్తుందని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సీనియర్లు, ఎంపిక చేసిన న్యాయమూర్తులు మాత్రమే కాకుండా తమకూ ఇందులో సభ్యత్వాన్ని కల్పించాలని కేంద్రం డిమాండ్ చేస్తోంది. ఫలితంగా న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల విషయంలో కొలీజియం తీసుకునే నిర్ణయాలు, సిఫారసులను సమీక్షించడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

సాధారణంగా ఈ కొలీజియంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి ఛైర్మన్ హోదాలో కొనసాగుతుంటారు. ప్రస్తుతం సీజేఐ డీవై చంద్రచూడ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్న కొలీజియంలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం షా, జస్టిస్ ముఖేష్ షా, జస్టిస్ అజయ్ రస్తోగి ఉన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా తాము సూచించిన వారికి కొలీజియంలో సభ్యత్వాన్ని కల్పించాలని ఇప్పుడు న్యాయశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామిని చేయాలని సూచించారు. కొలీజియం చేసే సిఫారసులు మరింత మెరుగ్గా, పారదర్శకంగా ఉండాలనేదే తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో సీనియర్ న్యాయవాదులకు న్యాయమూర్తులుగా ఎలివేషన్, న్యాయమూర్తుల బదిలీలు, వారిని సుప్రీంకోర్టులో అపాయింట్ చేయడం..ఇలాంటి కార్యకలాపాలన్నీ కొలీజయం పర్యవేక్షిస్తుంటుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసులు చేస్తుంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను దాదాపుగా కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంటుంది. ఈ సిఫారసులను తిప్పి పంపించిన సందర్భాలు తక్కువే.

న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యతను సంతరింప చేసుకోండి. న్యాయవ్యవస్థలో అపారదర్శకత నెలకొందంటూ ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ సహా మంపలువురు త్రులు వ్యాఖ్యానిస్తున్నారు.