సంక్రాంతి రోజున ఎంపీ సీఎం చౌహన్ కు తప్పిన ప్రమాదం

సంక్రాంతి పండగ వేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సురక్షితంగా బయటపడ్డారు. చౌహ‌న్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ ఆదివారం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయింది. హెలిక్యాప్ట‌ర్‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ధార్ జిల్లాలోని మ‌నావ‌ర్ టౌన్‌లో హెలిక్యాప్ట‌ర్‌ను కిందికి దింపారు.
 
 దాంతో, సీఎం శివ్‌రాజ్ సింగ్ రోడ్డు మార్గంలో 75 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి ధార్ చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.  ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికార, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ధార్‌లో ఒక ప‌బ్లిక్ ర్యాలీలో పాల్గొనేందుకు మ‌నావ‌ర్ నుంచి ధార్‌కు శివ్‌రాజ్‌సింగ్ హెలిక్యాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు. అయితే.. మార్గ‌మ‌ధ్య‌లోనే హెలిక్యాప్ట‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య ఏర్ప‌డింది. దాంతో, అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్స్ సుర‌క్షితంగా అత్య‌వ‌ర‌స ల్యాండింగ్ చేశారు. సీఎం చౌహ‌న్ రోడ్డు మార్గంలో ధార్ చేరుకున్నారని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది.
 
ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్ తో పాటు తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
 
దీన్ని దృష్టిలో ఉంచుకుని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ధార్ జిల్లాలో పర్యటించారు. మనావర్ పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  ఇందులో పాల్గొనడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ లో భోపాల్ నుంచి మనావర్ కు చేరుకున్నారు.
 
సభ అనంతరం బయలుదేరగా హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. టేకాఫ్ తీసుకుని కొంత దూరం వెళ్లిన తరువాత అవాంఛిత శబ్దం రావడంతో పైలెట్ అప్రమత్తం అయ్యారు.  హెలికాప్టర్ ను మళ్లీ మనావర్ కే మళ్లించారు. అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు.