2024 లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తధ్యం

2024 లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తధ్యం

2024 లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని చెబుతూ ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్నీ స్పష్టం చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్‍లోని 182 స్థానాల్లో బీజేపీ 156 సీట్లను సాధించి, వరుసగా ఏడోసారి అధికారం చేపట్టిందని గుర్తుచేస్తూ ఈ ఫలితాలతో లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలుస్తుందన్న సంకేతాలు దేశమంతా వచ్చేశాయని స్పష్టం చేశారు. 

గుజరాత్‍లోని గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ “ఈసారి కాంగ్రెస్ వాళ్లు కొత్త లుక్‍తో వచ్చారు. ఇక ఢిల్లీ నుంచి మరికొందరు కొత్తవాళ్లు (ఆమ్ఆద్మీ) వచ్చారు. అయినా బీజేపీ భారీ విజయం సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి మాత్రమే ముఖ్యం కాదు.. దేశమంతా సందేశం ఇచ్చాయి. 2024లో కూడా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి పదవి చేపడతారని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సందేశాన్ని ఇచ్చాయి” అని అమిత్ షా పేర్కొన్నారు.
 
వచ్చే ఏడాది జరిగే లోక్‍సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని, మరోసారి తమ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ కులతత్వపు విషాన్ని అంతమొందిచేందుకు గుజరాత్ ప్రజలు పని చేశారని చెప్పారు.
 
బూటకపు, తప్పుడు, ఆకర్షణీయమైన వాగ్దానాలను చేసిన వారిని తిరస్కరించారని, గుజరాత్, నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్న వారికి ప్రజలు గుణపాఠం చెప్పారని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితం కాగా, ఇక తీవ్రమైన పోటీని ఇస్తుందని భావించిన ఆమ్‍ఆద్మీ 5 సీట్లలో మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. తొలిసారి 150 కంటే ఎక్కువ సీట్లను సాధించింది. 1995 నుంచి గుజరాత్‍లో బిజెపినే అధికారంలో ఉంది.