జోషిమఠ్ సమస్యను పరిష్కరించేందుకు దశలవారీ చర్యలు

ఛమోలీ జిల్లాలోని జోషిమఠ్ పట్టణం కుంగిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు దశలవారీ చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి భరోసా ఇచ్చారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని తక్షణం ఆదుకునేందుకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన హామీ ఇచ్చారు.

”బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. పగుళ్లబారిన పడిన భవంతుల డీమార్కేషన్ ప్రక్రియ నిరంతర ప్రక్రియగాసాగుతోంది. భూమి కుంగిపోవడానికి కారణాలపై జియాలజిస్టులు, నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు” అని ఆయన చెప్పారు. పైగా, జిల్లా యంత్రాగం ఎప్పటికప్పుడు బాధిత ప్రజల అవసరాలను చూసుకుంటోందని, పునరావాస శిబిరాల్లో కనీస అవసరాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం సైతం శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు ఆరు నెలలు చెల్లించనవసరం లేకుండా మినహాయించామని, బ్యాంకు రుణాలపై ఏడాది మారటోరింయం ఇస్తున్నామని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యం బారిన ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర మంత్రులంతా ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.  అద్దె ఇండ్లలోకి మారిన కుటుంబాలకు నెలకు రూ. 5 వేల సాయం అందిస్తున్నామని, రీలొకేట్ అయిన ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపాధి హామీ పధకంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన వివరించారు.

సహాయ, పునరావాస చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానమంత్రి కార్యాలయం సైతం ఎప్పటికిప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు. కాగా, జోషిమఠ్ టౌన్ నుంచి ఇంతవరకూ 185 కుటుంబాలను సహాయ కేంద్రాలకు తరలించారు. ఇళ్లు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు రూ.1.5 లక్షల చొప్పున తాత్కాలిక సహాయన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇలా ఉండగా, జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి, ఇండ్లకు బీటలు రావడానికి అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) చేపట్టిన ప్రాజెక్టు కోసం టన్నెల్ తవ్వడం కారణంగానే వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ వాస్తవాలను తేల్చేందుకు 8 సంస్థలతో దర్యాప్తు చేయించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

జోషిమఠ్ పట్టణం కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించడంతో పాటు అక్కడి కొండ ప్రాంతాలు ఎంత భారం మోయగలవన్న దానినీ నిర్ధారింపనున్నట్లు తెలిపారు. కాగా, జోషిమఠ్లో ఇండ్లను కూల్చివేయడంలేదని, ప్రమాదకరంగా ఒరిగిన రెండు హోటళ్లను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు.

మరోవంక, చమోలీ జిల్లాలోని జోషిమఠ్ నుంచి ఔలిని కలిపే రోప్‌వే సేవలను శనివారం నుంచి నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ రోప్‌వే సేవలు నిలిపివేస్తున్నట్టు జిల్లా యంత్రాగం ప్రకటించింది. గత రెండు వారాలుగా వేలాది ఇళ్లు బీటలు వారిని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోప్‌వే ఆపరేషన్ మేనేజర్ దినేష్ భట్ తెలిపారు.

రోప్‌వే ఫ్లాట్‌ఫాం సమీపంలో శుక్రవారం ఆర్థరాత్రి కొన్ని పగుళ్లు కూడా కనిపించినట్టు ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తగానే రోప్‌వే సేవలు ఆపుచేసినట్టు తెలిపారు. జోషిమఠ్ నుంచి ఔలి వరకూ 4.15 కిలోమీటర్ల రోప్‌వే ఇదని, టవర్ నంబర్ 1 సమీపంలో పగుళ్లు కనిపించడంతో సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు