వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక

వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ పండుగ కానుక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని, ఈ రైలుతో విలువైన సమయం ఆదా అవుతోందని చెప్పారు.   తెలుగు రాష్ట్రాల్లో (సికింద్రాబాద్ నుంచి విశాఖ) ప్రారంభం కానున్న వందేభారత్ రైలును ప్రధాన మంత్రి ఆదివారం ఢిల్లీనుంచి వర్చువల్‌ గా ప్రారంభించారు.
దక్షిణ మధ్య రైల్వేలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్‌ రైలుగా చరిత్రలో నిలిచింది. ఆగి ఆగి నడిచే రైళ్ల నుంచి వేగంగా పరిగెత్తే రైళ్ళను తీసుకువచ్చామని, వందే భారత్ ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీక అని ప్రధాని తెలిపారు. ఇది భారత్‌లోనే డిజైన్ చేసి, తయారుచేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని, 2023లో ప్రారంభించిన కొత్త రైలు ఇదని పేర్కొన్నారు.
 
మారుతున్న దేశ భవిష్యత్కు వందేభారత్ ఉదాహరణ అని చెబుతూ భద్రతతోపాటు  రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని ప్రధాని చెప్పారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్న మోదీ ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలను చేరుస్తుందని పేర్కొన్నారు. కనెక్టివిటీతోనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
 
రైల్వేలో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వందే భారత్ అన్ని రాష్ట్రాలను అనుసంధానిస్తుందని పేర్కొంటూ అతితక్కువ సమయంలో 8 వందేభారత్ రైలు ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు.
 
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధాని మోదీ తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో రైల్వే వ్యవస్థను సౌకర్యవంతమైన ప్రయాణంగా మార్చామని, ఇప్పుడు రైళ్లు ఆధునిక భారత్‌కు అద్దం పడుతున్నాయని చెప్పారు. విస్టాడోమ్ రైలు, కిసాన్ రైలు, హెరిటేజ్ రైలు నడుపుతున్నామని గుర్తు చేశారు.
 
 24 పట్టణాలలో కొత్తగా మెట్రో రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో గడిచిన 8నెలల్లో అద్భుతమైన పనులు చేశామని చెప్పారు. గతంలో రూ. 250 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ. 3వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మెదక్ లాంటి అనేక ప్రాంతాలు రైల్వే వ్యవస్థతో కనెక్ట్ అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ మూడింతలు పెంచామని తెలిపారు.
 
 అలాగే ఏపీలో రైల్వే నెట్‌వర్క్‌ను పెంచడానికి కేంద్రం నిరంతరంగా పనిచేస్తోందని ప్రధాని తెలిపారు. 350 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను ఏపీలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఏటా 220 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ ఏపీలో చేస్తున్నామని, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ బిజినెస్ పెంచుతున్నామని ప్రధాని మోదీ వివరించారు.
 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ఫారంపై జరిగిన ప్రారంభవేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైశ్ణవ్‌, కిశన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. వారంలో 6 రోజులపాటు విశాఖ వందేభారత్‌ రైలు సేవలు అందిస్తుంది.