మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని

కరోనా సమయంలో  తాను చేసిన సేవా కార్యక్రమాలను కించపరిచేలా మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. అనాధ పిల్లలకు కుర్ కురే ప్యాకెట్లు పంచిపెడితే తప్పుబట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్‌ కంటే దిగజారి మాట్లాడుతున్నారని చెబుతూ  తాను కేటీఆర్‌లా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను మంత్రిని కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగానని చెప్పారు. ‘‘విద్యావంతుడు.. కాస్త ఆలోచించి మాట్లాడతారని కేటీఆర్‌ గురించి తెలంగాణ సమాజం అనుకుంది.. కానీ, ఆయన తండ్రి కంటే దిగజారి మాట్లాడుతున్నారు. సూర్యుడిపై ఉమ్మివేసినట్లుగా ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధులపై వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజీనామా లేఖతో రావాలని బండి సంజయ్‌ సవాల్‌ చేసినా.. సీఎం కేసీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కేటీఆర్‌ లాంటివారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను తాను ఎన్నిసార్లు పరామర్శించానో ప్రజలకు తెలుసని ఆయన గుర్తు చేశారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, దేశ ప్రతిష్ఠ, గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో ఐఎ్‌సఐ కార్యకలాపాలు, మత కలహాలు ఎలా తగ్గిపోయాయో గమనించాలని సూచించారు.
 
 ‘‘దేశ సైనికుల గొప్పదనాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారు. పటిష్ఠమైన మన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్‌, శ్రీలంకతో పోలుస్తారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ అంటారు.. ఇదేం పద్ధతి..? ప్రధాని మోదీని విమర్శించండి. కానీ దేశ గౌరవాన్ని తగ్గించవద్దు..’’ అని కేసీఆర్‌కు హితవు పలికారు. కేసీఆర్‌ ఇలాగే మత విద్వేషాలను రెచ్చగొడితే దేశం అఫ్గానిస్తాన్‌లా మారినా ఆశ్చర్యం లేదని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 10 లక్షల మందికి ఉద్యోగ భర్తీలు జరుపుతుందని పేర్కొంటూ ప్రతి నెలా 70 వేల నుంచి లక్ష ఉద్యోగాల భర్తీ చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పిన ఆయన  ఈ నెల 20న మరికొందరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తామని తెలిపారు.

  తెలంగాణలో ఫ్లోరోసిస్ నిర్మూలక కోసం కేంద్రం రూ. 800 కోట్లు నిధులిచ్చిందని కేంద్ర మంత్రి చెప్పారు. వందే భారత్ రైలును వైజాగ్ వరకు పొడిగించినందుకు ప్రధానికి  కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇప్పటివరకు తెలంగాణకు రూ.5వేల కోట్లకు పైగా నిధులిచ్చామని పేర్కొన్నారు.దేశంలో ఎయిమ్స్ హస్సిటల్స్ ను పెంచిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని చెప్పారు.

రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు కేంద్రం రూ.146 కోట్లు ఇచ్చిందని చెప్పారు. తాను కూడా ఒక టీబీ రోగిని దత్తత తీసుకున్నానని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికీ ఆయుష్మాన్‌ భారత్‌ను పూర్తిగా అమలుచేయకపోవడం విచారకరమని చెప్పారు.