చైనాలో 90 కోట్ల మందికి కరోనా

కరోనాకు పుట్టినిళ్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి.
 
 ఈ క్రమంలోనే జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు పెకింగ్‌ యూనివర్సిటీ  అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్​ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్‌లో 91 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రావిన్స్‌ తర్వాత యూనాన్‌  ప్రాంతంలో 84 శాతం, కింఘైలో 80 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు పేర్కొంది.
 
కాగా, చైనా వ్యాప్తంగా మరో 2-3 నెలల వరకు కరోనా గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.  ప్రస్తుతం డ్రాగన్‌ న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీన చైనీయులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు.
 
గత మూడేళ్లుగా కరోనా నిబంధనల మధ్య మగ్గిన చైనీయులు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయడంతో కోట్లాది మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.
 
ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో తీవ్రదశ ఇంకా ముగియలేదని అక్కడ అధికారి ఒకరు తెలిపారు. వైరస్‌ విషయంలో ఇప్పటి వరకు ప్రాధాన్యత అంతా నగరాలపైనే ఉందని చెప్పారు. అయితే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నెల రోజుల్లో 60 వేలమంది మరణించినట్లు ప్రకటన

ఇలా ఉండగా, చైనాలో కేవలం నెల రోజుల్లోనే 60వేల మంది కరోనా వ్యాధి కారణంగా చనిపోయారని చైనా ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. డిసెంబర్‌లో వైరస్ ఆంక్షలు ఎత్తివేశాక మరణాల గురించి తెలుపని చైనా ఇప్పుడు తొలి మరణాల సంఖ్యను వెల్లడించింది.

చైనాలో 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 వరకు కరోనా  కారణంగా మరణించిన వారి సంఖ్య 59938గా ఉంది. ఈ వివరాలను జాతీయ ఆరోగ్య కమిషన్ యొక్క మెడికల్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరో హెడ్ జియోవ్ యహూయి విలేకరుల సమావేశంలో తెలిపారు. వైద్య సంస్థలు రికార్డు చేసిన మరణాల రికార్డుల మేరకే ఈ సంఖ్య. మొత్తంగా చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు.

మరణాల్లో వైరస్ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టమై మరణించిన వారి సంఖ్య 5503 కాగా,  కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 54435గా ఉంది. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని చైనాపై ఆరోపణలు ఉన్నాయి. మరణాల సంఖ్యను మరింత ర్యాపిడ్‌గా, రెగ్యులర్‌గా, ఆసుపత్రుల నమ్మదగిన డేటా అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రేయేసస్ చైనాను కోరారు. చైనాలో 60 ఏళ్లకు పైబడిన లక్షలాది మందికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. చాలా మంది వ్యాధిని తట్టుకోలేకుండా చనిపోయారు.