పాక్ పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రదాడి

పాకిస్తాన్‌ పెషావర్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఈ దాడిలో 6-8 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రనేడ్లు, స్నిపర్‌ గన్లతో పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యారు.
ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రిక్‌-ఈ-తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 
పెషావర్‌లోని సర్బంద్ పోలీస్ స్టేషన్‌పై శనివారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో డీఎస్సీ సహా ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. పోలీస్‌ స్టేషన్‌లోకి రావడంతోనే లాంగ్‌ రేంజ్‌ రైఫిళ్లు, స్నిపర్ గన్‌లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్టేషన్‌ను మూడు వైపుల నుంచి ఉగ్రవాదులు చుట్టుముట్టారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
 
అనంతరం గ్రనేడ్లు విసిరి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఘటన సమయంలో 12 నుంచి 14 మంది పోలీసులు స్టేషన్‌లో విధుల్లో ఉన్నారు. ఈ దాడిని పోలీసు ఆపరేషన్స్ సీనియర్ సూపరింటెండెంట్ కాషిఫ్ అఫ్తాబ్ అబ్బాసీ ధృవీకరించారు. మృతులను డీఎస్పీ బడాబెర్ సర్దార్ హుస్సేన్, ఇర్షాద్, జెహాంజేబ్‌గా గుర్తించారు.
 
పరారీలో ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రవాద దాడిని ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. ఇది బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఉగ్రదాడిని పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారని ప్రశంసించారు. అమరులకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.