పర్యావరణాన్ని కాపాడడంలో ముందువరుసలో భారత్

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించడంలో భారతదేశం ముందు వరుసలో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. శుక్రవారం ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్‌‌)లో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2023లో మాట్లాడుతూ ఓవైపు పెరుగుతున్న ఇంధన డిమాండ్‌‌ను తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని చెప్పారు.
ఆటో ఎక్స్‌పో-2023 దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమకు సరికొత్త సాంకేతికత, సామర్థ్యంతో పాటు భవిష్యత్తు అవసరాలకు తగిన మొబిలిటీ ఎకో సిస్టమ్ తయారుచేసేందుకు పరిష్కారాలను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒక వేదికను అందిస్తుందని తెలిపారు. 

“ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించడంలో భారతదేశం ముందు వరుసలో ఉంది. తన శక్తి పరివర్తన ఎజెండాలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను ఏకకాలంలో పరిష్కరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తామనే తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి భారతదేశం ఎంతమేరకు కృషి చేస్తుందో నేటి కార్యక్రమం సూచిస్తుంది” అని కేంద్ర మంత్రి తెలిపారు.

 “ఇది దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇతర వాటాదారులకు కూడా ఒక వేదికను అందిస్తుంది” అని మంత్రి చెప్పారు. ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసిఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐఏఎం) “ఎక్స్‌ప్లోర్ ది వరల్డ్ ఆఫ్ మొబిలిటీ” అనే థీమ్‌తో ఆటో ఎక్స్‌పో-2023ని నిర్వహిస్తున్నాయి.

ఈవెంట్‌కు 100 కంటే ఎక్కువ కంపెనీలు, 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. “ఇది అనుకూలమైన, పెట్టుబడి-స్నేహపూర్వక వాతావరణం, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి  మద్దతుతో ప్రపంచ ఆర్థిక వృద్ధికి, ప్రపంచ వినియోగానికి డ్రైవర్‌గా భారతదేశాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది” అని హర్దీప్ ఎస్. పూరి స్పష్టం చేశారు.

ఇథనాల్ మిశ్రమంలో భారతదేశం సాధించిన పురోగతి గురించి మంత్రి మాట్లాడుతూ  2013-14లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53% నుండి 2022 నాటికి 10.17%కి పెంచామని, ఇది నవంబర్ 2022 గడువు కంటే చాలా ముందుగానే ఉందని చెప్పారు. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని 2030 నుండి 2025-26కు ముందుకు జరిపామని తెలిపారు.

ఇది దేశ ఇంధన భద్రతను పెంపొందించడమే కాకుండా, ఫారెక్స్ నిల్వలను రూ. 41,500 కోట్లను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. జీహెచ్‌జీ ఉద్గారాలను 27 లక్షల ఎంటీకు తగ్గించడంతో రూ.40,600 కోట్లకు పైగా వేగవంతమైన చెల్లింపులతో రైతులకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు.

సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 5% నుండి 1%కి తగ్గించడంతో  ఇథనాల్ సరఫరాదారులకు దాదాపు రూ.400 కోట్లు ఆదా అయ్యాయని చెబుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ కోసం బయో-ఇంధనంపై జిఎస్‌టిని 18% నుండి 5%కి తగ్గించామని పేర్కొన్నారు. హర్యానాలోని పానిపట్ (పరాలీ), పంజాబ్‌లోని భటిండా, ఒడిశాలోని బార్‌గఢ్ (పరాలీ), అస్సాంలోని నుమాలిగఢ్ (బ్యాంబు), కర్ణాటకలోని దేవంగెరెలో  ఐదు 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి వివరించారు.